Revanth Reddy: ‘పోతిరెడ్డిపాడు’పై ఆ రోజునే జగన్ కు కేసీఆర్ హామీ ఇచ్చారు: రేవంత్ రెడ్డి ఆరోపణలు
- గతంలో కేసీఆర్ కుటుంబం కాంచీపురం సందర్శించారు
- ఆ సమయంలోనే వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్లారు
- అప్పుడే, జగన్ కు, వైసీపీ నేతలకు కేసీఆర్ హామీ ఇచ్చారు
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసినా తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించడం లేదంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా, కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి దీనిపై స్పందించారు.
గతంలో కాంచీపురం సందర్శనకు సీఎం కేసీఆర్ సహా ఆయన కుటుంబం వెళ్లినప్పుడు వైసీపీ నేత రోజా ఇంటికి వారు వెళ్లిన విషయాన్ని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ కు సంబంధించిన హామీని అప్పుడే జగన్ కు, ఆ పార్టీ నేతలకు కేసీఆర్ ఇచ్చారని ఆరోపించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రుల హోదాలో కేసీఆర్, జగన్ లు రెండు సార్లు సమావేశమయ్యారని గుర్తుచేశారు.
ఇదే విషయాన్ని ఏపీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా అధికారికంగా చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. ‘పోతిరెడ్డిపాడు’ కు సంబంధించిన ఏపీ జీవో 203.. కేసీఆర్ ప్రగతిభవన్ లో తయారైందేనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘పోతిరెడ్డిపాడు’పై కేసీఆర్, జగన్ లు కలిసే నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. ‘పోతిరెడ్డిపాడు’ విస్తరణ పనులను కాంగ్రెస్ పార్టీ తరఫున అడ్డుకుంటామని హెచ్చరించారు.