Nirmala Sitharaman: ఇకపై రూ. 200 కోట్లలోపు కొనుగోళ్లకు గ్లోబల్ టెండర్లకు అవకాశం లేదు: నిర్మలా సీతారామన్

No global tender for government procurement up to Rs 200 crore says Nirmala Sitharaman

  • జన్ ధన్ ఖాతాల్లోకి రూ. 52,606 కోట్లు బదిలీ చేశాం
  • డిస్కంలకు రూ. 90 వేల కోట్లు
  • టీడీఎస్ రేటును 25 శాతం తగ్గిస్తున్నాం

ప్రభుత్వ కొనుగోళ్లలో ఇకపై రూ. 200 కోట్ల వరకు ఏ సేకరణ అయినా దేశీయంగానే ఉంటుందని... రూ. 200 కోట్ల లోపు కొనుగోళ్లకు గ్లోబల్ టెండర్లకు అవకాశం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ గురించి ఆమె మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ పథకం కింద 41 కోట్ల జన్ ధన్ ఖాతాల్లోకి రూ. 52,606 కోట్లను బదిలీ చేశామని చెప్పారు. మోదీ ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ గురించి మాట్లాడుతూ ఆమె ఈ వివరాలను వెల్లడించారు.

నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ కంపెనీలకు రూ. 30 వేల కోట్ల నిధులను విడుదల చేస్తామని చెప్పారు. పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు రూ. 90 వేల కోట్ల సాయాన్ని అందిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ప్రాజెక్టులను పూర్తి చేయడానికి 6 నెలల గడువును పెంచుతున్నామని చెప్పారు. పూర్తయిన పనుల స్థాయిని బట్టి బ్యాంకు గ్యారంటీలను పాక్షికంగా విడుదల చేయవచ్చని అన్నారు. దీని వల్ల కాంట్రాక్టర్లకు లభ్యత కొరత కొంత వరకు తగ్గుతుందని చెప్పారు.

ప్రస్తుతం ఉన్న టీడీఎస్ రేటును 25 శాతం తగ్గిస్తున్నామని... రేపటి నుంచి 2021 మార్చ్ 31 వరకు ఈ తగ్గింపు రేటు అమల్లో ఉంటుందని తెలిపారు. అలాగే, ఇకపై ఎంఎస్ఎంఈల నిర్వచనాన్ని మారుస్తున్నామని... రూ. 1 కోటి పెట్టుబడి, రూ. 5 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలను మైక్రో కంపెనీలుగా గుర్తిస్తామని చెప్పారు. రూ. 10 కోట్ల ఇన్వెస్ట్ మెంట్ రూ. 50 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలను చిన్న తరహా కంపెనీలుగా భావిస్తామని తెలిపారు. రూ. 20 కోట్ల పెట్టుబడి రూ. 100 కోట్ల టర్నోవర్ ఉండే కంపెనీలను మధ్య తరగతి కంపెనీలుగా పరిగణిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News