BSE: ప్యాకేజీపై ఇన్వెస్టర్ల గంపెడాశలు... భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్!
- రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీపై కన్ను
- రెండు శాతానికి పైగా లాభాల్లో సూచీలు
- హెల్త్ సెక్టార్ మినహా మిగతా అన్నీ లాభంలోనే
కరోనా వైరస్ మహమ్మారితో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను, ప్రజలను ఆదుకునేందుకు జీడీపీలో 10 శాతానికి సమానమైన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించనున్నామని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు మార్కెట్ వర్గాల్లో గంపెడాశలను పెంచడంతో, ఈ ఉదయం బీఎస్ఈ, ఎన్ఎస్ఈ సూచీలు భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి. ఈ ఉదయం 10.15 గంటల సమయంలో సెన్సెక్స్ 685 పాయింట్లు పెరిగి 2.18 శాతం లాభంతో 32,506 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 192 పాయింట్లు పెరిగి 2.09 శాతం లాభంతో 9,388 పాయింట్ల వద్దా కొనసాగుతున్నాయి. ఓ దశలో నిఫ్టీ 9,554 పాయింట్ల వరకూ వెళ్లడం గమనార్హం.
నిఫ్టీ-50లో 45 కంపెనీలు లాభాల్లో ఉన్నాయి. ముఖ్యంగా నిర్మాణ రంగ సంస్థలు, బ్యాంకులు, సిమెంట్, వాహన కంపెనీల ఈక్విటీ వాటాల విలువ నాలుగు నుంచి ఐదు శాతం మేరకు పెరిగింది. హెల్త్ సెక్టార్ నష్టాల్లో నడుస్తోంది. కమోడిటీ మార్కెట్ల విషయానికి వస్తే, బంగారం ధర స్వల్పంగా లాభపడగా, వెండి ధర స్వల్పంగా నష్టపోయింది. పది గ్రాముల బంగారం ధర రూ. 16 పెరిగి రూ. 45,641 వద్ద, కిలో వెండి ధర రూ. 66 తగ్గి రూ. 42,988 వద్దా కొనసాగుతున్నాయి. క్రూడాయిల్ ధర మరో అరశాతానికి పైగా పతనమైంది.