parent circle: స్కూళ్లు తెరిచినా మా పిల్లల్ని ఇప్పుడే పంపబోం.. తేల్చి చెబుతున్న ముంబై వాసులు!
- తల్లిదండ్రులను వెంటాడుతున్న కరోనా భయం
- దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ సర్వే నిర్వహించిన ‘పేరెంట్ సర్కిల్’
- ఆరు నెలల వరకు తమ పిల్లల్ని బయటకు పంపబోమన్న తల్లిదండ్రులు
కరోనా వైరస్ భయం వెంటాడుతున్న నేపథ్యంలో పాఠశాలలను తెరిచినా తమ పిల్లల్ని మాత్రం పంపేది లేదని ముంబై వాసులు తేల్చి చెబుతున్నారు. ఆన్‌లైన్ పేరెంటింగ్ సంస్థ ‘పేరెంట్ సర్కిల్’ దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించగా, ముంబైలోని పిల్లల తల్లిదండ్రులు తమ మనోభావాన్ని ఇలా వెల్లడించారు.
ఈ సర్వేలో దేశవ్యాప్తంగా 12 వేల మంది తల్లిదండ్రులు పాల్గొనగా, వీరిలో 54 శాతం మంది ముంబై వారే కావడం గమనార్హం. పాఠశాలలు తిరిగి ప్రారంభమైనా నెల రోజుల వరకు తమ పిల్లల్ని పంపబోమని వీరిలో 24 శాతం మంది పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని స్కూలుకు పంపి సమస్యలు కొనితెచ్చుకోబోమన్నారు.
ఆరు నెలల వరకు తమ పిల్లల్ని బయటకు పంపేందుకు, స్నేహితులను కలిసేందుకు, సినిమాలకు, మాల్స్‌కు అనుమతించబోమని 43 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు. పాఠశాలల్లో తమ పిల్లల భద్రతకు పూర్తి హామీ లభించిన తర్వాత మాత్రమే పిల్లల్ని స్కూలుకు పంపుతామని మరికొందరు పేర్కొన్నారు.