Corona Virus: మెదడు నుంచి కాలివేళ్ల వరకు దేన్నైనా కరోనా దెబ్బతీస్తుందంటున్న నిపుణులు!

Corona can damage from brain to toes as per world medical experts saying

  • మొదట్లో కరోనా అంటే జలుబు, జ్వరం అనే భావన
  • క్రమంగా వైద్యులకు సవాల్ గా మారిన కరోనా లక్షణాలు
  • శరీరంలోని అన్ని భాగాలపై కరోనా దాడి

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భూతం ప్రధానంగా మానవుల్లో శ్వాస సంబంధ వ్యవస్థపై తన ప్రభావాన్ని చూపుతుందని ఇప్పటివరకు భావిస్తూ వచ్చారు. తొలినాళ్లలో అయితే అసలీ వైరస్ లక్షణాలు ఏంటో కూడా తెలియని అయోమయ వ్యవస్థలో వైద్యులు చికిత్స కొనసాగించారు.

ఎక్కువ మందిలో న్యూమోనియో లక్షణాలు కనిపించడంతో ఇది ప్రధానంగా శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీస్తుందని అంచనా వేశారు. అయితే, కేసులు పెరిగేకొద్దీ కరోనా విశ్వరూపం కూడా వైద్య నిపుణులకు క్రమంగా బోధపడుతోంది. ఇది శ్వాస వ్యవస్థనే కాదని, తలలో ఉన్న మెదడు నుంచి కాలివేళ్ల వరకు దేన్నైనా దెబ్బతీయగలదని గుర్తించారు.

దీనిపై న్యూయార్క్ నగరంలోని మౌంట్ సినాయ్ ఆసుపత్రిలోని చీఫ్ ఫిజీషియన్ గా పనిచేస్తున్న వాలెంటిన్ ఫుస్టర్ మాట్లాడుతూ, మొదట్లో తాము ఏ వ్యాధికి చికిత్స చేస్తున్నామో కూడా తెలియలేదని, కళ్లముందే రోగులు మృత్యువాత పడుతుంటే చూశామని తెలిపారు. ఇదంతా హఠాత్తుగా జరిగిపోతోందని అనిపించిందని, అయితే ఎందుకు ఇలా జరుగుతోందని మాత్రం అర్థం కాలేదని అన్నారు.

కొలంబియా యూనివర్సిటీకి చెందిన ఏంజెలా రాస్ ముసెన్ అనే వైరాలజిస్ట్ స్పందిస్తూ, ఒక్క వైరస్ కారణంగా రోగిలో ఇన్ని వ్యాధి లక్షణాలు ఎలా ఉత్పన్నమవుతున్నాయో తెలుసుకోలేపోతున్నామని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు కరోనా గురించి తెలిసింది గోరంత మాత్రమేనని, తెలియాల్సింది కొండంత ఉందని అభిప్రాయపడ్డారు. ఇది శ్వాసకోశ వ్యవస్థపై దాడి చేసి, న్యూమోనియా వంటి లక్షణాలను కలిగించే వ్యాధి అని అప్పట్లో ఎవరూ భావించలేదని డేవిడ్ రీచ్ అనే కార్డియాలజిస్ట్ తెలిపారు.

కానీ ఆ తర్వాత కాలంలో కరోనా వైద్య నిపుణులకు మరింత సవాల్ గా మారింది. కరోనా గుండెపై ప్రభావం చూపి, గుండె చుట్టూ ఉన్న కండరాలను నాశనం చేసి, ఎంతో కీలకమైన హృదయ స్పందనను సైతం దెబ్బకొడుతోందని వైద్యులు తెలుసుకున్నారు. అంతేకాదు, ఇది మూత్రపిండాలకు కూడా ప్రబల శత్రువు అన్నది అనేక కేసుల ద్వారా వెల్లడైంది. కొన్ని ఆసుపత్రుల్లో కరోనా రోగులకు డయాలసిస్ చేసేందుకు తగినన్ని యూనిట్లు కూడా లేని పరిస్థితి ఏర్పడింది.

నాడీవ్యవస్థలోనూ ప్రవేశించి రుచి, వాసన చూసే శక్తిని కోల్పోయేలా చేయడం కూడా కరోనా చేసే మాయలో భాగమని వైద్య నిపుణులు అంటున్నారు. కొన్ని సందర్భాల్లో మెదడుకు కూడా చేరి అక్కడి కణజాలాన్ని అస్తవ్యస్తం చేస్తుందని, రక్తనాళాల్లో తిష్టవేసి రక్తం గడ్డకట్టేలా చేస్తుందని తెలుసుకున్నారు. మొదట్లో కరోనా అంటే జలుబు, జ్వరం అని భావించిన వైద్య నిపుణులు ఇప్పుడు లక్షణాల జాబితాలో మరెన్నో అంశాలు చేర్చారు.

  • Loading...

More Telugu News