Pawan Kalyan: కరోనా కారణంగా ప్రజలు ఆందోళన చెందుతుంటే అధికార పక్షం తీరు మరోలా ఉంది: పవన్ కల్యాణ్
- గత ప్రభుత్వం తరహాలోనే ఏపీ సర్కారు వ్యవహరిస్తోందని విమర్శలు
- ఇసుక, మట్టి అక్రమంగా తవ్వేస్తున్నారని ఆరోపణ
- ప్రజలు అంతా గమనిస్తున్నారని హెచ్చరిక
జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందుతున్న తరుణంలో అధికార పక్షం తీరు మరోలా ఉందని ఆరోపించారు. గత టీడీపీ ప్రభుత్వం తరహాలోనే ఇప్పటి ప్రభుత్వం కూడా ఇసుక, మట్టి అక్రమాలు సాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ తప్పులను సరిచేయాల్సిన నేటి ప్రభుత్వం కూడా అదే మార్గంలో పయనించడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ అక్రమాలపై ఎవరన్నా ప్రశ్నిస్తే కేసులు నమోదు చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని వెల్లడించారు.
కరోనా సహాయక చర్యలు విస్తృతంగా చేయాల్సిన తరుణంలో ఇసుక అక్రమ రవాణా చేసే వాహనాలు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నాయని విమర్శించారు. ఇసుక, మట్టి, గ్రావెల్ వంటి వనరులను అక్రమంగా ఎలా తవ్వుతున్నారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని పవన్ హెచ్చరించారు. సముద్ర తీరానికి రక్షణ కల్పించే మడ అడవులను కూడా కాకినాడలో ధ్వంసం చేశారని, తూర్పు గోదావరి జిల్లాలో ఇళ్ల స్థలాల కోసం కొబ్బరి తోటలు నరికేస్తున్నారని మండిపడ్డారు. మడ అడవుల ధ్వంసంపై గ్రీన్ ట్రైబ్యునల్ లో కేసు వేస్తే విచారణకు ఆదేశించిందని వెల్లడించారు.
వరి రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వకుండా పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యాన్ని తీసుకువస్తున్నారు అని తెలియగానే వాటిని అడ్డుకోవాలంటూ డిమాండ్ చేశామని, తత్ఫలితంగా ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రవాణా ఆగిందని అన్నారు. తూర్పు గోదావరి జిల్లా జనసేన నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ సందర్భంగా పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.