Maharashtra: మహారాష్ట్రలో లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కొరడా!
- 1,03,345 కేసుల నమోదు
- 19,630 మంది అరెస్ట్
- రూ. 4 కోట్ల వరకు జరిమానాల వసూలు
కరోనా కట్టడి కోసం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. లాక్ డౌన్ నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెపుతున్నా... పలువురు వ్యక్తులు వీటిని బేఖాతరు చేస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా ఉన్న మహారాష్ట్రలో కూడా ప్రజలు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు.
ఈ నేపథ్యంలో నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై ఆ రాష్ట్ర పోలీసులు భారీ సంఖ్యలో కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,03,345 కేసులను పోలీసులు నమోదు చేశారు. వీరిలో 19,630 మందిని అరెస్ట్ చేశారు. ఇల్లీగల్ ట్రాన్స్ పోర్ట్ కింద 1,291 కేసులను నమోదు చేశారు.
ట్రాఫిక్ రూల్స్ ను అధిగమించినందుకు మహారాష్ట్ర పోలీసులు 55,784 వాహనాలను సీజ్ చేశారు. దాదాపు రూ. 4 కోట్ల వరకు జరిమానాలు వసూలు చేశారు. మరోవైపు రాష్ట్ర పోలీసుల్లో 887 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 22 వేలు దాటింది. 832 మంది మృతి చెందారు.