Jagan: విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై మంత్రులు, అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ

jagan on gas leak

  • గ్యాస్‌ లీక్‌ అనంతరం తీసుకుంటున్న చర్యలపై సూచనలు 
  • మూడు రోజుల్లో బాధితులందరికీ ఆర్థిక సాయం అందించాలి
  • ఐదు గ్రామాల్లో ఈ రోజు రాత్రి బస చేయాలి
  • గ్యాస్ లీక్ ప్రభావిత గ్రామాల్లో ప్రతి కుటుంబానికీ రూ.10 వేలివ్వాలి

విశాఖపట్నం సమీపంలోని ఆర్ఆర్‌ వెంకటాపురంలోని ఓ పరిశ్రమలో గ్యాస్‌ లీక్‌ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. గ్యాస్‌ లీక్‌ అనంతరం తీసుకుంటున్న చర్యలపై ఆయన మాట్లాడారు. జగన్‌కు  మంత్రులు, అధికారులు అన్ని వివరాలు అందించారు.

సహాయక చర్యలతో పాటు బాధితులకు అందాల్సిన పరిహారంపై మంత్రులు, ఏపీ అధికారులకు జగన్ కీలక సూచనలు చేశారు. మృతులకు చెందిన ఐదు కుటుంబాలకు ఇప్పటికే పరిహారం ఇచ్చామని మంత్రులు జగన్‌కి చెప్పారు. కొందరు నగరానికి దూరంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం పరిహారం అందుకోలేకపోయారని, వారికి కూడా త్వరలోనే అందిస్తామని చెప్పారు.

గ్యాస్ లీక్ జరిగిన గ్రామాల్లో, ఇళ్లలో శానిటేషన్ పనులు ప్రారంభమయ్యాయని, ఈ రోజు సాయంత్రం కల్లా పూర్తిగా ముగుస్తాయని తెలిపారు. కాగా, మూడు రోజుల్లో బాధితులందరికీ ఆర్థిక సాయం అందించాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు. ముందుగా చెప్పినట్లు మంత్రులంతా ఐదు గ్రామాల్లో ఈ రోజు రాత్రి బస చేయాలని ఆయన చెప్పారు.

గ్యాస్ లీక్ ప్రభావిత గ్రామాల్లో ప్రతి కుటుంబానికీ రూ.10 వేలు ఇవ్వాలని జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు బ్యాంకు ఖాతాలు సేకరించే పనిని వాలంటీర్లకు అప్పజెప్పాలని కోరారు. రాష్ట్రమంతటా వున్న పరిశ్రమల్లో విస్తృతంగా తనిఖీలు చేయాలని ఆదేశించారు.

Jagan
YSRCP
Andhra Pradesh
Vizag Gas Leak
  • Loading...

More Telugu News