Gautam Gambhir: ఆటగాళ్లు కూడా కరోనాతో కలిసి జీవించక తప్పదు: గంభీర్
- క్రీడారంగంలో పెద్ద మార్పులేవీ ఉండబోవన్న గంభీర్
- బంతి మెరుగు కోసం ఐసీసీ ఏదైనా పదార్థాన్ని అందించాలని సూచన
- క్రికెటేతర ఆటల్లో భౌతికదూరం కష్టమేనని వెల్లడి
టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ తాజా పరిస్థితులపై స్పందించారు. కరోనా కలకలం సద్దుమణిగాక క్రీడారంగంలో పెనుమార్పులు వస్తాయని భావించడంలేదని అన్నారు. అయితే సాధారణ ప్రజల తరహాలోనే ఆటగాళ్లు కూడా కరోనాతో కలిసి జీవించాల్సి ఉంటుందని, కొద్దిపాటి మార్పులు తప్ప క్రీడారంగం మునుపటిలానే ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
క్రికెట్ బంతిపై బౌలర్లు ఉమ్మి పూసి రుద్దడం ద్వారా మెరుగు తీసుకువచ్చేవారని, ఇప్పుడా అవకాశం ఉండకపోవచ్చని, ఉమ్మికి ప్రత్యామ్నాయంగా ఐసీసీ ఏదైనా కృత్రిమ పదార్థాన్ని అందించాలని గంభీర్ సూచించాడు. ఇక, క్రికెట్ లో భౌతిక దూరం పాటించడం సాధ్యమేనని, ఇతర క్రీడల్లోనే ఏదైనా మార్గం ఆలోచించాలని పేర్కొన్నాడు. హాకీ, ఫుట్ బాల్ వంటి ఆటల్లో భౌతికదూరం పాటించడం కష్టసాధ్యమైన విషయం అని అభిప్రాయపడ్డాడు.