Rahul Gandhi: రాహుల్ పట్టాభిషేకం కోసమే 11 మంది సభ్యులతో కమిటీ!
- మన్మోహన్ అధ్యక్షతన కన్సల్టేటివ్ గ్రూప్
- గత నెలలో ఏర్పాటు చేసిన సోనియా
- సభ్యుడిగా రాహుల్ గాంధీ
- సొంత వ్యూహంతో ముందుకు సాగుతున్న రాహుల్
కరోనా సంక్షోభం వేళ సమస్యల గురించి చర్చించడానికి అంటూ మన్మోహన్ సింగ్ అధ్యక్షతన 11 మంది సభ్యులతో కన్సల్టేటివ్ గ్రూప్ ను కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీ సైతం ఈ కమిటీలో సభ్యుడిగా ఉండటం గమనార్హం. దీంతో రాహుల్ గాంధీకి మరోసారి పార్టీ పగ్గాలను అప్పగించేందుకు మార్గాన్ని రూపొందించారన్న ఊహాగానాలు మిన్నంటుతున్నాయి. గత సంవత్సరం ఆగస్టులో తిరిగి పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన సోనియా, ఆ బాధ్యతలను సాధ్యమైనంత త్వరగా రాహుల్ కు అప్పగించాలని, అప్పటివరకూ రాహుల్ తన సొంత వ్యూహ ప్రతివ్యూహాలతోనే ముందుకు సాగే అవకాశం ఇవ్వాలని కూడా సోనియా భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక ఈ కమిటీని సైతం రాహుల్ పట్టాభిషేకానికి మార్గం సుగమం చేసేందుకే సోనియా ఏర్పాటు చేశారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ కమిటీ తొలి సమావేశం గత నెల 20న వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సాగగా, కేంద్రం విధించిన లాక్ డౌన్ గడువు ముగిసిన తరువాత పరిస్థితి ఏంటని కమిటీ కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ సందర్భంగా మాట్లాడిన సోనియా, లాక్ డౌన్ ను ఎంత కాలం పొడిగిస్తారని కేంద్రాన్ని నిలదీస్తూ, దీనికి ప్రామాణికం ఏంటని ప్రశ్నించారు. లాక్ డౌన్ 3.0 తర్వాత పరిస్థితి ఏంటో ముందే ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
గత సంవత్సరం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర వైఫల్యం తరువాత, రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. పార్టీ పగ్గాలు గాంధీ-నెహ్రూ వారసుల చేదాటి పోరాదన్న అభిప్రాయంలో ఉన్న సీనియర్ నేతలంతా, మరోసారి రాహుల్ కే బాధ్యతలు ఇవ్వాలని సోనియాపై ఒత్తిడి తెస్తున్నారు. పార్టీలో సీనియర్ నేతల సంఖ్యే అధికంగా ఉందన్న విషయాన్ని పసిగట్టిన సోనియా గాంధీ, యువ నాయకత్వానికి పెద్దపీట వేయాలని, రాహుల్ సైతం తన సొంత క్యాడర్ ను అభివృద్ధి చేసుకోవాలని ఇప్పటికే సూచించారని తెలుస్తోంది.
రాహుల్ నిర్ణయాలకు పెద్దపీట వేసేందుకే ఈ 11 మంది సభ్యుల కమిటీలో సీనియర్లకు స్థానం కల్పించారని కూడా మరో వాదన వినిపిస్తోంది. కాంగ్రెస్ వెటరన్ నేతలు అహ్మద్ పటేల్, ఏకే ఆంటోనీ, అంబికా సోనీ, గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మలతో పాటు రాహుల్ కోటరీలోని కేసీ వేణుగోపాల్, రణ్ దీప్ సుర్జేవాలా, ప్రవీణ్ చక్రవర్తి, గౌరవ్ వల్లభ్, రోహన్ గుప్తా, సుప్రియా శ్రీనాటేలకూ స్థానం లభించింది. వీరితో పాటు మన్మోహన్ సింగ్ కమిటీ అధ్యక్షుడిగా ఉండగా, చిదంబరం, జైరామ్ రమేశ్ లూ ఉన్నారు. గతంలో రాహుల్ గాంధీ, ఈ ముగ్గురూ తీసుకున్న పలు నిర్ణయాలతో ఏకీభవించలేదన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆర్థిక, సామాజికాంశాలపై రాహుల్ దృష్టి మరోలా ఉండటం, ఈ కమిటీలో రాహుల్ తీసుకునే నిర్ణయమే ఫైనల్ కానుందనడంలో సందేహం లేదు.
ఇదే సమయంలో రాహుల్ తీసుకునే ఏ నిర్ణయమైనా, అతను ఎంచుకున్న టీమ్ శక్తి సామర్థ్యాలపై ఆధారపడివుంటుంది. ఈ విషయాన్ని బాహాటంగానే అంగీకరిస్తున్న కాంగ్రెస్ శ్రేణులు, రాహుల్ ప్రస్తుతానికి దూరదృష్టితోనే ముందడుగు వేస్తున్నారని, ఆయన ఆలోచనాతీరు కూడా మారిందని కితాబిస్తున్నాయి. ఏదిఏమైనా, అతి త్వరలోనే మరోమారు రాహుల్ పట్టాభిషేకం జరుగుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.