Nani: ఆ ఉంగరం మింగిన చేప ఏమైంది? 'జగదేకవీరుడు - అతిలోక సుందరి' సీక్వెల్ పై హీరో నాని హింట్!
- మూడో వీడియోను విడుదల చేసిన నానీ
- విడుదల సమయంలో నిర్మాత కష్టాన్ని వివరించిన నానీ
- సీక్వెల్ పై ఆశలు పెంచిన కొసమెరుపు
"తెలుగు సినిమా చరిత్రలోనే జగదేకవీరుడు - అతిలోకసుందరి ఓ తుఫాన్. 30 యేళ్లు అయింది. ఓ చిన్న డౌట్ మిగిలిపోయింది. ఉంగరం ఏమైంది? ఉంగరం మింగిన చేప ఏమైంది?" అని హీరో నాని ఈ చిత్రానికి సీక్వెల్‌పై ఆశలను కల్పిస్తూ, తన మూడో భాగాన్ని విడుదల చేశారు. సినిమా విడుదలై మే 9వ తేదీకి 30 సంవత్సరాలు కాగా, ఆ సమయంలో వచ్చిన తుఫాను, సినిమా విడుదలకు నిర్మాత అశ్వనీదత్ పడ్డ కష్టాన్ని నానీ వివరించారు. 'జగదేకవీరుడు - అతిలోకసుందరి' ఇప్పటికే రెండు కథనాలు వినిపించిన నాని మూడో వాయిస్ ఓవర్ వీడియోనూ విడుదల చేశారు.
కాగా, ఈ సినిమాకు తాను సీక్వెల్ తీస్తానని అశ్వనీదత్ ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నారు. తాను నిర్మాతగా రిటైర్ అయ్యేలోగా సీక్వెల్ వస్తుందని కూడా ఆయన చెప్పారు. మూడు దశాబ్దాల క్రితం ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచిన ఈ సినిమా సీక్వెల్ పై నాని ఇచ్చిన కొసమెరుపు మరోసారి మెగా అభిమానుల్లో కొత్త చర్చకు దారి తీసింది.