Vaccine: కోతులకు కరోనా వ్యాక్సిన్... తొలి ప్రయత్నంలోనే విజయం సాధించిన చైనా
- కరోనా జన్మస్థానంగా చైనాకు చెడ్డపేరు!
- వ్యాక్సిన్ అభివృద్ధిలో ముందంజ వేసిన డ్రాగన్ కంట్రీ
- మానవులపై ప్రయోగాల కోసం పరిశోధకుల ఎదురుచూపులు
కరోనాకు పుట్టిల్లుగా అప్రదిష్ఠ మూటగట్టుకున్న చైనా, ఆ మహమ్మారికి విరుగుడు కనుగొనే దిశగా కీలక ముందడుగు వేసింది. చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ను కోతులపై దిగ్విజయంగా పరీక్షించి చూశారు. మొదటి ప్రయత్నంలోనే సత్ఫలితాలు రావడంతో చైనా పరిశోధకుల్లో ఆనందోత్సాహాలు పెల్లుబుకుతున్నాయి. ఈ వ్యాక్సిన్ ను బీజింగ్ కు చెందిన సినోవాక్ బయోటెక్ అనే పరిశోధక సంస్థ అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సిన్ కు 'పికోవాక్' అని నామకరణం చేశారు.
రీసస్ మకాకస్ అనే భారత సంతతి కోతులకు మొదటిగా ఈ వ్యాక్సిన్ ను ఇచ్చారు. తర్వాత ఈ కోతులను కరోనా వైరస్ కు గురిచేసి, కోవిడ్ 19 వ్యాధి వచ్చేలా చేశారు. శాస్త్రవేత్తలు కోరుకున్న విధంగానే, 'పికోవాక్' వ్యాక్సిన్ కోతుల్లో కరోనాను ఎదుర్కొనేందుకు అవసరమైన యాంటీబాడీలను పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేసింది. ఆ మేరకు కోతుల వ్యాధి నిరోధక శక్తికి బలం చేకూర్చింది. ఈ ప్రయోగం ద్వారా మరో ఆసక్తికర అంశం కూడా వెల్లడైంది. వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా కోతుల్లో తయారైన యాంటీబాడీలు కేవలం కరోనా వైరస్ నే కాదు, ఇతర సాధారణ వైరస్ లపైనా దాడికి దిగుతున్నట్టు గుర్తించారు. అలాగే, ఈ వ్యాక్సిన్ ఇవ్వని కోతుల్లో తీవ్ర స్థాయిలో న్యూమోనియా రావడాన్ని పరిశోధకులు గుర్తించారు.
అయితే, పరిశోధకుల ముందు ఇప్పుడు అతిపెద్ద సవాల్ నిలిచింది. వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలక దశ మానవులపై పరీక్షించి చూడడమే. తమ ప్రయోగాలకు కరోనా పేషెంట్లు ముందుకు వస్తారా? అన్న సందేహం వారిని వేధిస్తోంది. చైనాలో కొన్నివారాల కిందట వేల సంఖ్యలో ఉన్న కరోనా రోగులు నేడు కొద్ది సంఖ్యలోనే ఉన్నారు. వీరిలో స్వచ్ఛందంగా పరీక్షలకు సహకరించేవారి కోసం పరిశోధకులు ఎదురుచూస్తున్నారు.