Chiranjeevi: శ్రీదేవి లేనిదే 'జగదేకవీరుడు అతిలోక సుందరి' లేదు: చిరంజీవి
- దేవత పాత్రలో శ్రేదేవి గొప్పగా చేసింది
- ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోలేము
- అతిలోక సుందరంటే శ్రీదేవినే అని చెప్పిన చిరూ
తెలుగు సినిమా చరిత్రలో మైలురాళ్లుగా చెప్పుకునే గొప్ప చిత్రాలలో 'జగదేకవీరుడు అతిలోక సుందరి' ఒకటి. చిరంజీవి - శ్రీదేవి జంటగా నటించిన ఆ సినిమా, దర్శకుడిగా రాఘవేంద్రరావు స్థాయిని మరింత పెంచింది. ఆ సినిమా 30 ఏళ్లను పూర్తి చేసుకున్న సందర్భంగా చిరంజీవి ఓ వీడియో ద్వారా తన మనోభావాలను పంచుకున్నారు.
ముఖ్యంగా ఆయన శ్రీదేవి గురించి మాట్లాడుతూ .. "శ్రీదేవి లేనిదే ఈ సినిమా లేదు .. ఈ సినిమా .. ఈ పాత్ర కేవలం శ్రీదేవి కోసమే తయారయ్యాయా అనిపిస్తుంది. దేవతగా ఆ పాత్రలో శ్రీదేవిని తప్ప మరొకరిని ఊహించుకోలేము. తన అందచందాలతో .. హొయలతో .. చిలక పలుకులతో .. అమాయకపు చూపులతో .. శ్రీదేవి ఆ పాత్రను అత్యద్భుతంగా చేసింది. ఇప్పటికీ అతిలోక సుందరి అంటే శ్రీదేవినే గుర్తొస్తుంది. అంతగా ఆమె ఆ పాత్రతో ప్రభావితం చేసింది. అలాంటి శ్రీదేవితో కలిసి నటించడం ఒక అందమైన అనుభూతి. ఆమెతో డాన్స్ చేయడానికి నేను పోటీ పడవలసి వచ్చింది .. శ్రమ పడవలసి వచ్చింది" అంటూ చెప్పుకొచ్చారు.