bank: మరో ఎగవేత కేసు: భారతీయ బ్యాంకుల నుంచి 414 కోట్ల రుణం తీసుకుని విదేశాలకు పరారీ!

Another Bank Defaulter Flees Country  SBI Complains To CBI After 4 Years

  • 2016లోనే రామ్‌దేవ్ అంతర్జాతీయ సంస్థ యజమానులు పరారీ
  • ఆరు బ్యాంకులను మోసం చేసిన వైనం
  • నాలుగేళ్ల తర్వాత ఎస్‌బీఐ ఫిర్యాదు
  • కేసు నమోదు చేసిన సీబీఐ

భారతీయ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని విదేశాలకు పారిపోతున్న వారి ఉదంతాలు చాలా ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే కొంత మంది బడా పారిశ్రామికవేత్తలు విదేశాలకు పారిపోవడం కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. తాజాగా, ఇటువంటి ఘటనే మరొకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ‌ఢిల్లీకి చెందిన బాస్మ‌తి బియ్యం ఎగుమ‌తి చేసే రామ్‌దేవ్ అంతర్జాతీయ సంస్థ యజమానులు ఎస్బీఐతో పాటు మొత్తం ఆరు బ్యాంకుల నుంచి‌ మొత్తం రూ.414 కోట్లు రుణం తీసుకున్నారు. ఈ కేసుల్లో వారు డిఫాల్ట‌ర్లుగా ఉన్నారు. 2016 నుంచి ఆ డిఫాల్ట‌ర్లు కనపడట్లేదు. వీరు విదేశాలకు చెక్కేశారని తెలుస్తోంది.

వారు తీసుకున్న రుణాలు చెల్లించకపోవడంతో మొండి బకాయిల జాబితాలో 2016లోనే దీన్ని చేర్చారు. అయితే, నాలుగేళ్ల తర్వాత.. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 25న డిఫాల్ట‌ర్ల‌పై ఎస్‌బీఐ ఫిర్యాదు చేసింది. దీనిపై సీబీఐ ఏప్రిల్ 28వ తేదీన కేసు బుక్ చేసింది. ఆ సంస్థకు చెందిన వారు ఎస్‌బీఐ నుంచి రూ.173.11 కోట్లు, కెనరా బ్యాంకు నుంచి రూ.76.09 కోట్లు, యూనియన్ బ్యాంకు నుంచి రూ.64.31 కోట్లు సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.51.31 కోట్లు, కార్పొరేషన్ బ్యాంకు నుంచి రూ. 36.91 కోట్లు, ఐడీబీఐ బ్యాంకు నుంచి రూ.12.27 కోట్లు తీసుకున్నట్లు తెలిసింది. ఆ కంపెనీ డైర‌క్ట‌ర్లు న‌రేశ్ కుమార్‌, సురేశ్ కుమార్‌, సంగీత‌, ఇత‌రుల‌పై సీబీఐ ఫోర్జ‌రీ, చీటింగ్ కేసుల‌ను నమోదు చేసి విచారణ కొనసాగిస్తోంది.

  • Loading...

More Telugu News