Deepika Chikhaliya: సీతారాములుగా వాళ్లిద్దరూ బాగుంటారన్న 'రామాయణం' సీత
- 'రామాయణం' ధారావాహికకు తగ్గని ఆదరణ
- రాముడిగా హృతిక్, సీతగా అలియా భట్ సరిపోతారు
- రావణుడిగా అజయ్ దేవగణ్ బాగుంటాడన్న దీపిక
చాలాకాలం క్రితం వచ్చిన రామానంద్ సాగర్ 'రామాయణం' ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఆ ధారావాహికలో 'సీత' పాత్రను పోషించిన దీపిక చిఖలియా నటనకి ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపించారు. నిజమైన సీత అలాగే ఉండేదేమోనని అనుకున్నారు. ఇప్పటికీ అప్పటి ఆమె రూపం వాళ్ల మనసు తెరపై అలాగే వుండిపోయింది. అంతగా దీపిక ప్రేక్షకులను ప్రభావితులను చేసింది.
ఆ ధారావాహికను ఇటీవల ప్రసారం చేయగా అనూహ్యమైన రీతిలో ఆదరణ లభించింది. దాంతో ఈ ధారావాహికలో నటించిన దీపిక హర్షాన్ని వ్యక్తం చేసింది. 'రామాయణం' కథను హిందీ సినిమాగా తీస్తే శ్రీరాముడిగా హృతిక్ రోషన్ .. సీతాదేవిగా అలియా భట్ కరెక్టుగా సరిపోతారని చెప్పింది. రావణుడి పాత్రకి అజయ్ దేవగణ్ .. లక్ష్మణుడి పాత్రకి వరుణ్ ధావన్ సరిగ్గా సరిపోతారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. భారీస్థాయిలో 'రామాయణం' సినిమాను నిర్మించాలన్న వాళ్లు దీపిక అభిప్రాయాన్ని ఏమైనా పరిశీలిస్తారేమో చూడాలి.