Nara Lokesh: సీఎం చీకటి పడకముందే ఇంటికెళ్లి పడుకున్నారు, ప్రజలేమో రోడ్డున పడ్డారు: లోకేశ్
- వైజాగ్ లో గ్యాస్ లీక్ ఘటన
- 12 మంది మృతి
- వందల సంఖ్యలో ప్రజలు ఆసుపత్రుల పాలైన వైనం
వైజాగ్ గ్యాస్ లీక్ ఘటన రాజకీయ విమర్శలకు, ప్రతి విమర్శలకు దారితీసింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. బాధ్యతలేని సీఎం చీకటి పడకముందే ఇంటికి వెళ్లి పడుకున్నారని, ప్రజలేమో రోడ్డున పడ్డారని ట్వీట్ చేశారు. గ్యాస్ లీక్ ఘటనతో నిరాశ్రయులుగా మారిన ప్రజలకు ఈ ప్రభుత్వం కనీసం ఒక్కరోజు పునరావాసం కల్పించలేకపోయిందా? అంటూ ప్రశ్నించారు.
దీనికి సంబంధించిన వీడియోను కూడా లోకేశ్ పోస్టు చేశారు. ఆ వీడియోలో, చాలామంది ప్రజలు తమ కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డు పక్కనే ఫుట్ పాత్ పై పడుకుని ఉన్న దృశ్యాలు చూడొచ్చు. వైజాగ్ ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి వెలువడిన స్టిరీన్ అనే విషవాయువు పీల్చి 12 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. వందల సంఖ్యలో ప్రజలు ఆసుపత్రుల పాలయ్యారు. ముందుజాగ్రత్త చర్యగా వెంకటాపురంలో ఇళ్లను ఖాళీ చేయించారు.