Pregnant: గర్భవతులపై కరోనా ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే...!
- అత్యధికుల్లో న్యూమోనియా గుర్తింపు
- నెలలు నిండకుండానే ప్రసవాలు
- 50 శాతం మంది గర్భవతుల్లో లక్షణాలు లేకుండానే కరోనా నిర్ధారణ
కరోనా మహమ్మారి బారినపడుతున్న వాళ్లలో అన్ని వయసుల వారు ఉంటున్నారు. ఇది గర్భవతులపైనా తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. కరోనాతో బాధపడుతున్న 16 దేశాలకు చెందిన 441 మంది గర్భవతులను పరిశీలించారు. వారిలో 96 శాతం మందికి న్యూమోనియా ఉన్నట్టు గుర్తించారు. సాధారణంగా కొన్ని సందర్భాల్లో మహిళలు నెలలు నిండకుండానే బిడ్డకు జన్మనిస్తుంటారు. ఈ తరహా ప్రసవాల శాతం 13.6 కాగా, కరోనా వైరస్ ప్రభావంతో ఆ రేటు 26కి పెరిగిందట. కరోనా సోకిన గర్భవతులకు నెలలు నిండకముందే ప్రసవాలు జరుగుతున్నట్టు తేలింది.
కాగా ఈ 441 కేసుల్లో 9 మంది గర్భవతులు మరణించగా, నలుగురు శిశువులు ప్రసవానంతరం చనిపోయారు. ఆరు కేసుల్లో శిశువులు తల్లిగర్భంలోనే మృతి చెందారు. ఆయా దేశాల్లో గర్భవతులు కరోనా బారిన పడిన తర్వాత 56 శాతం మంది జ్వరం, 43 శాతం మంది దగ్గు, 19 శాతం మంది కండరాల నొప్పులు, 18 శాతం మంది శ్వాస తీసుకోలేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొన్నారు. కరోనా పాజిటివ్ గర్భవతుల్లో 10 శాతం మంది హైపర్ టెన్షన్, 9 శాతం మంది గర్భంతో వచ్చే మధుమేహంతోనూ బాధపడుతున్నట్టు వెల్లడైంది.
ముఖ్యంగా, లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్ రావడం గర్భవతుల్లోనూ కనిపించిందని అధ్యయనంలో పేర్కొన్నారు. సుమారు 50 శాతం మంది గర్భవతుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా కరోనా నిర్ధారణ అయిందట.