Nara Lokesh: విశాఖ వాసులు విషాదంలో వుంటే వైసీపీ విషప్రచారానికి తెరలేపింది!: నారా లోకేశ్
- దోపిడీలు చేయడం, విద్వేషాలు రాజేయడం వారికి తెలుసు
- ‘ట్విట్టర్’ యూజర్ నేమ్ 15 అక్షరాలు దాటి తీసుకోదు
- ఈ ఇంగితజ్ఞానం కూడా వారికి లేదు
విశాఖలో గ్యాస్ లీకేజ్ ఘటనను ఆధారంగా చేసుకుని సామాజిక మాధ్యమాల వేదికగా వస్తున్న పుకార్లు నమ్మొద్దని టీడీపీ నేత నారా లోకేశ్ సూచించారు. గ‌్యాస్ లీకేజ్ తో విశాఖ వాసులు విషాదంలో వుంటే వైసీపీ విషప్రచారానికి తెరలేపిందని దుయ్యబట్టారు.
‘అమరావతి ప్రజల ఏడుపు తగిలే విశాఖ వాళ్లకు ఇలా జరుగుతోంది..’ అంటూ ‘మై క్యాపిట్ అమరావతి’ ట్విట్టర్ ఖాతా ద్వారా వచ్చిన ఓ పోస్ట్ ను ఉద్దేశించి లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ఫేక్ ట్వీట్లు చేసి విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వైసీపీ, పేటీఎం పుత్రులు విషప్రచారానికి తెరలేపారని మండిపడ్డారు. దొంగతనాలు, దోపిడీలు చేయడం, విద్వేషాలు రాజేయడం తప్పించి ట్విట్టర్ అక్కౌంట్ యూజర్ నేమ్ 15 అక్షరాలు దాటి తీసుకోదన్న కనీస ఇంగితజ్ఞానం కూడా లేదని, ఆ పేరుతో ‘ట్విట్టర్లో’ ఖాతా లేదని అన్నారు.
డబ్బులిస్తామంటే కన్నతల్లిని కూడా చంపేసే టైపు పేటీఎం బ్యాచులే ఇటువంటి విద్వేషాలు పెంచే విషప్రచారానికి దిగుతాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పుకార్లు నమ్మొద్దని,ఐదు రూపాయల కోసం రాష్ట్రాన్ని, ప్రజలను తాకట్టు పెట్టేందుకైనా వెనుకాడని పేటీఎం బ్యాచ్ ల ఫేక్ ప్రచారానికి విజ్ఞతతో బదులిద్దామని తన వరుస ట్వీట్లలో లోకేశ్ పేర్కొన్నారు.