Vizag: రసాయన బాధితులతో నిండిపోయిన విశాఖ కేజీహెచ్... అధికారుల్లో కొత్త టెన్షన్!
- కలకలం రేపిన విశాఖ రసాయనాల లీకేజ్
- ఆసుపత్రులకు పరుగులు పెడుతున్న బాధితులు
- కార్లు, వ్యాన్ల ప్రయాణానికి అనుమతినిచ్చిన అధికారులు
విశాఖపట్నంలో నేడు జరిగిన రసాయనాల లీక్ అధికారులకు కొత్త తలనొప్పులను తెచ్చి పెట్టింది. నగర పరిధిలోని గోపాలపట్నంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ కాగా, ఇప్పటివరకూ ఎనిమిది మంది మరణించారు.
ఈ ఘటన తరువాత 3 నుంచి 5 కిలోమీటర్ల మేరకు విష వాయువులు విస్తరించగా, పలువురు తీవ్ర అస్వస్థతకు గురై, విశాఖ కేజీహెచ్ కి పరుగులు పెట్టారు. ఇప్పటికే సుమారు 200 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. బాధితులతో కేజీహెచ్ నిండిపోయింది. బాధితుల్లో చిన్నారుల సంఖ్య అధికంగా ఉండటంతో ఒక్కో బెడ్ పై ముగ్గురు చొప్పున చిన్నారులకు వైద్యం అందిస్తున్నారు. బాధితులను ఆసుపత్రులకు తరలించేందుకు అంబులెన్స్ లు సరిపడక పోవడంతో వ్యాన్లు, కార్లను కూడా అనుమతించారు.
కాగా, విష వాయువులు లీక్ అయిన తరువాత, అవి కళ్లలోకి ప్రవేశించగా, కళ్లు కనపడక, ఓ వ్యక్తి బావిలో పడి మరణించాడు. ఇక్కడికి సమీపంలోని వెంకటాపురంలో పలు పశువులు మృత్యువాత పడ్డాయి. పాలిమర్స్ చుట్టూ ఉన్న చెట్లు మాడిపోయాయని తెలుస్తోంది. సహాయక చర్యలు అందించడానికి వచ్చిన పలువురు పోలీసులు కూడా అస్వస్థతకు గురికాగా, వారిని హాస్పిటల్స్ కు తరలించారు. ఘటనా స్థలానికి వచ్చిన డీసీపీ ఉదయ్‌భాస్కర్ కూడా అస్వస్థతకు గురయ్యారు.
ఇప్పటికే కరోనా కారణంగా నానా అవస్థలూ పడుతున్న వైద్యాధికారులు, ఈ రసాయన లీక్ తో ఒక్కసారిగా షాక్ నకు గురయ్యారు. కరోనా బాధితులు, అనుమానితులు ఉన్న ఆసుపత్రుల్లో కెమికల్ లీక్ బాధితులు చేరుతూ ఉండటంతో వైరస్ మరింతగా విస్తరించే ప్రమాదం పొంచివుందన్న ఆందోళన వ్యక్తం చేశారు.