Karimnagar: కరీంనగర్ లో దుకాణాలు తెరిచేందుకు సరి-బేసి సంఖ్య విధానం
- మూడు కేటగిరీలుగా దుకాణాల విభజన
- ‘ఏ’ లో నిత్యావసర, మద్యం, నిర్మాణ రంగం దుకాణాలు
- ‘బీ’ లో బట్టలు, పాదరక్షల దుకాణాలు
- సీ’లో హోటల్స్, స్కూల్స్, సినిమా హాల్స్, జిమ్స్
లాక్ డౌన్ లో భాగంగా సూచించిన మార్గదర్శకాలను అనుసరించి కరీంనగర్ నగరపాలక సంస్థ ముందుకెళ్లనుంది. నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న దుకాణాలను తెరిచేందుకు సరి-బేసి సంఖ్య విధానాన్ని అమలు చేయనున్నట్టు నగరపాలక సంస్థ కమిషనర్ వల్లూరి క్రాంతి తెలిపారు. నగరంలోని మొత్తం దుకాణాలను ‘ఏ, ‘బీ‘, ‘సీ‘.. అంటూ మూడు కేటగిరీలుగా విభజించినట్టు చెప్పారు.
కేటగిరి ‘ఏ’ లో నిత్యావసర, మద్యం, నిర్మాణ రంగానికి సంబంధించిన దుకాణాలు ఉన్నాయని, ఉదయం నుంచి సాయంత్రం వరకు వీటిని తెరచుకోవచ్చని తెలిపారు. కేటగిరి ‘బీ’ లో బట్టలు, పాదరక్షల దుకాణాలు ఉన్నాయని, వీటిని తెరిచేందుకు సరి-బేసి సంఖ్య విధానం అమలు చేస్తామని చెప్పారు. కేటగిరి ‘సీ’లో హోటల్స్, స్కూల్స్, సినిమా హాల్స్, జిమ్స్ ఉన్నాయని.. వీటిని తెరవకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
లాక్ డౌన్ ముగిసే వరకు తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. వ్యాపారస్తులు మాస్కులు తప్పక వినియోగించాలని, తమ దుకాణాల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.