Riyaz Naikoo: టెర్రరిస్టులకు కోలుకోని దెబ్బ.. హిజ్బుల్ టాప్ కమాండర్ నైకూను కాల్చి చంపిన బలగాలు
- పుల్వామా జిల్లాలో ఎన్ కౌంటర్
- అంతకు ముందే మొబైల్, ఇంటర్నెట్ బంద్
- నైకూతో పాటు మరొకరు హతం
కశ్మీర్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ రియాజ్ నైకూ (32)ను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. జమ్మూకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఈ ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో నైకూ హతమయ్యాడు. ఈ ఆపరేషన్ ను జమ్మూకశ్మీర్ పోలీసులు, సైన్యం కలిసి నిర్వహించాయి. ఈ ఎన్ కౌంటర్ లో నైకూతో పాటు మరో ఉగ్రవాది హతమయ్యాడు. అతన్ని నైకూ అనుచరుడిగా భావిస్తున్నారు. దక్షిణ కశ్మీర్ ప్రాంతంలో నిర్వహించిన మూడు ఆపరేషన్లలో ఇదొకటి. పాంపోర్ ప్రాంతంలోని షార్షలీ ప్రాంతంలో నిర్వహించిన మరో ఆపరేషన్ లో ఇద్దరు టెర్రరిస్టులను కాల్చి చంపారు.
నైకూను ఎన్ కౌంటర్ చేసిన ఆపరేషన్ ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. ఆపరేషన్ నేపథ్యంలో కశ్మీర్ లోయలోని 10 జిల్లాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలను ఆపేశారు. నైకూ హతమయ్యాడనే వార్తలతో అల్లర్లు చెలరేగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంలో ఈ సేవలను కట్ చేశారు.
నైకూ కోసం గత 8 ఏళ్లుగా భద్రతాదళాలు వెతుకుతున్నాయి. 2016లో బుర్హాన్ వనీ హతమైన తర్వాత నైకూ కీలక నేతగా ఎదిగాడు. స్థానిక పోలీసులను చంపుతూ మాస్టర్ మైండ్ గా అవతరించాడు. 2012లో నైకూ టెర్రరిస్టుగా అవతరించాడు. అంతకు ముందు ఓ స్కూల్ లో లెక్కల టీచర్ గా పని చేసేవాడు. గులాబీ పూవుల పెయింటింగ్ వేయడంలో నైకూ దిట్ట. ఈయన తలపై రూ. 12 లక్షల రివార్డు ఉంది.