Srinivas Goud: మద్యం ధరలను పెంచడానికి కారణం ఇదే: టీఎస్ అబ్కారీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

This is the reason to hike liquor price says Srinivas Goud

  • పక్క రాష్ట్రాల్లో అమ్మకాలు ప్రారంభమయ్యాయి
  • వేరే రాష్ట్రాల నుంచి కల్తీ మద్యం కూడా వచ్చింది
  • 28 షాపుల లైసెన్సులు రద్దు చేశాం

తెలంగాణలో మద్యం ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా దాదాపు 40 రోజుల తర్వాత ఈరోజు మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. పెరిగిన ధరలకే ఈరోజు మద్యాన్ని అమ్మారు. మరోవైపు హైదరాబాద్ నాంపల్లిలోని అబ్కారీ భవన్ లో ఉన్నతాధికారులతో ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశమయ్యారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో మద్యం లభించకపోవడంతో వేరే రాష్ట్రాల నుంచి కల్తీ మద్యం కూడా వచ్చిందని చెప్పారు. తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాలు ముందుగానే మద్యం దుకాణాలను తెరిచాయని అన్నారు. మద్యం అందుబాటులో లేకపోవడంతో గుడుంబా మళ్లీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. జడ్చర్లలో గుడుంబా తయారీని అడ్డుకున్న సిబ్బందిపై దాడి చేశారని తెలిపారు. కొన్ని చోట్ల సారాకు రంగు కలపి విస్కీలా అమ్ముతున్నారని చెప్పారు. ఇది ఒక మాఫియాలా మారిందని తెలిపారు. వీటన్నింటిపై మంత్రులు, ఉన్నతాధికారుల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే మద్యం దుకాణాలను తెరవాలని నిర్ణయించామని చెప్పారు.

పక్క రాష్ట్రంలో మద్యం ధరలను 75 శాతం పెంచడంతో తప్పని పరిస్థితుల్లో మన రాష్ట్రంలో కూడా 16 శాతం వరకు ధరలను పెంచాల్సి  వచ్చిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో మద్యం నిల్వలు తగినన్ని ఉన్నాయని, మద్యం కొరత ఏర్పడే అవకాశం లేదని చెప్పారు. వైన్ షాపుల వద్ద భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించామని తెలిపారు. నిబంధనలను పాటించని  28 షాపులపై కేసులు నమోదు చేసి, లైసెన్సులను రద్దు చేసినట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News