Ravi Shastri: 1985 నాటి భారత జట్టు ఇప్పటి కోహ్లీ సేనను దీటుగా ఎదుర్కోగలదు: రవిశాస్త్రి
- 1985లో వరల్డ్ చాంపియన్ షిప్ నెగ్గిన భారత్
- నాడు రవిశాస్త్రికి మ్యాన్ ఆఫ్ ద సిరీస్
- వైట్ బాల్ క్రికెట్లో ఏ జట్టుకైనా '85' జట్టుతో కష్టాలు తప్పవన్న శాస్త్రి
టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1985 నాటి భారత జట్టు ఇప్పటి కోహ్లీ సేనకు కష్టాలు సృష్టించగలదని అభిప్రాయపడ్డారు. 1985లో భారత జట్టు సునీల్ గవాస్కర్ నాయకత్వంలో ఆస్ట్రేలియాలో వరల్డ్ చాంపియన్ షిప్ ఆఫ్ క్రికెట్ టోర్నీ గెలిచింది. ఆ టోర్నీలో అద్భుతంగా రాణించిన రవిశాస్త్రి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కింద ఖరీదైన ఆడి కారు గెలుచుకున్నాడు. నాటి జట్టు ఎంత బలమైనదో వివరిస్తూ, 85 నాటి జట్టు వైట్ బాల్ క్రికెట్లో ఇప్పటి కోహ్లీ సేనను ముప్పుతిప్పలు పెట్టగలదని అన్నాడు. ఏ జట్టును వాళ్ల ముందు ఉంచినా చివరి బంతి వరకు తీవ్ర పోరాటం తప్పదు అని వ్యాఖ్యానించాడు.
అంతేకాదు, కపిల్ దేవ్ నాయకత్వంలో తొలిసారి వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టు కంటే 1985 నాటి భారత జట్టే బలమైనదని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. తాను ఆ రెండు జట్లలో ఉన్నానని, 83లో ఆడిన కీలక ఆటగాళ్లు 85 నాటి జట్టులో ఉన్నా, కొందరు యువ ఆటగాళ్ల రాకతో జట్టు మరింత బలోపేతం అయిందని వివరించాడు. లక్ష్మణ్ శివరామకృష్ణన్, సదానంద్ విశ్వనాథ్, మహ్మద్ అజహరుద్దీన్ వంటి కుర్రాళ్లతో జట్టు దృఢంగా మారిందని తెలిపాడు.