Liquor Bill: ఒకే వ్యక్తికి రూ.52 వేల విలువైన మద్యం విక్రయం.... సోషల్ మీడియాలో బిల్లు వైరల్.. విచారణ!
- బెంగళూరు దక్షిణ ప్రాంతంలో ఘటన
- నిబంధనలకు విరుద్ధంగా ఒక వ్యక్తికి భారీగా మద్యం విక్రయం
- సోషల్ మీడియాలో బిల్లు చూసిన ఎక్సైజ్ శాఖ
దేశంలో నిబంధనల ప్రకారం ఎవరికైనా పరిమితంగానే మద్యం విక్రయించాల్సి ఉంటుంది. లాక్ డౌన్ ఆంక్షల సడలింపులో భాగంగా మద్యం దుకాణాలు తెరవడంతో కర్ణాటకలోనూ మందుబాబులు భారీగా తరలివచ్చారు.
ఈ నేపథ్యంలో, ఓ వ్యక్తికి సంబంధించిన మద్యం కొనుగోలు బిల్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో ఆ వ్యక్తికి మద్యం అమ్మిన దుకాణదారు చిక్కుల్లోపడ్డాడు. ఇంతకీ ఆ బిల్లు విలువ రూ.52,841 కావడమే సమస్యకు కారణం. కేవలం ఒక వ్యక్తికి అంత మొత్తంలో మద్యం ఎలా విక్రయించారంటూ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఈ వ్యవహారంపై దృష్టి సారించింది. సదరు మద్యం దుకాణం యజమానిపై కేసు నమోదు చేసింది.
నిబంధనల ప్రకారం రోజుకు ఒక వ్యక్తికి 2.6 లీటర్ల దేశీయ తయారీ విదేశీ మద్యం, లేక 18 లీటర్ల బీరు మాత్రమే విక్రయించాలి. కానీ ఈ వ్యవహారంలో బెంగళూరు దక్షిణప్రాంతంలోని వెనిల్లా స్పిరిట్ జోన్ అనే మద్యం దుకాణం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్టు గుర్తించారు. ఆ దుకాణం ద్వారా ఓ కస్టమర్ కు 13.5 లీటర్ల లిక్కర్, 35 లీటర్ల బీరు అమ్మినట్టు తేలింది.
సింగిల్ బిల్లు రూ.52 వేలు దాటడంతో ఈ విషయం వాట్సాప్ లో వైరల్ గా మారింది. ఆ బిల్లును అందరూ షేర్ చేస్తుండడంతో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కంటబడింది. దాంతో అధికారులు మద్యం అమ్మిన షాపు యజమానిని ప్రశ్నించగా, ఎనిమిది మంది వ్యక్తులు గుంపుగా వచ్చి కొనుగోలు చేశారని వివరించాడు. కానీ బిల్లు మాత్రం ఒకటే ఇచ్చామని చెప్పడంతో అధికారులు విచారణకు ఉపక్రమించారు.