Nimmagadda Ramesh: నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పిటిషన్ పై విచారణ ఎల్లుండికి వాయిదా
- పిటిషనర్ తరఫు వాదనలు విన్న హైకోర్టు
- ఇవాళ ఐదు గంటల పాటు విచారణ
- ఎల్లుండి వాదనలు వినిపించనున్న ప్రభుత్వం, ఈసీ
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి నుంచి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తొలగింపు వ్యవహారం హైకోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. ఎస్ఈసీ పదవీకాలాన్ని తగ్గిస్తూ ఏపీ సర్కారు ఆర్డినెన్స్ తీసుకురాగా, ఆర్డినెన్స్ లో పేర్కొన్న ప్రకారం తన పదవీకాలం ముగియడంతో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎస్ఈసీగా వైదొలగక తప్పలేదు. దాంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలోనే మరికొన్ని పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. వీటిపై హైకోర్టులో సుమారు 5 గంటలపాటు విచారణ జరిగింది. పిటిషనర్ల న్యాయవాదుల తరఫున వాదనలు పూర్తయ్యాయి.
ఎస్ఈసీ పదవి నుంచి నిమ్మగడ్డ తొలగింపు రాజ్యాంగవిరుద్ధమని, ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ కొట్టివేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోరారు. ఈ నేపథ్యంలో, వాదనలు వినిపించేందుకు ప్రభుత్వానికి ఒకరోజు సమయం ఇవ్వాలని కోర్టు నిర్ణయించింది. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. ఈ పిటిషన్లపై ప్రభుత్వం, ఈసీ తరఫు న్యాయవాదులు గురువారం నాడు తమ వాదనలు వినిపించనున్నారు. శుక్రవారం సాయంత్రానికి ఈ వ్యవహారంలో విచారణ పూర్తయ్యే అవకాశముందని తెలుస్తోంది.