Nagababu: కేంద్రం, రాష్ట్రాల నుంచి కరోనా ఇదే కోరుకుంటోంది: నాగబాబు
- యూపీలో 100 కోట్లు, ఏపీలో 68 కోట్ల కలెక్షన్లు
- ప్రభుత్వాల నిర్ణయాలను మందుబాబులు మెచ్చుకుంటున్నారు
- మహిళలు మాత్రం శపిస్తున్నారు
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రమాద ఘంటికలను మోగిస్తున్న తరుణంలో... నిన్న పలు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు షురూ అయిన సంగతి తెలిసిందే. ప్రజల రక్షణను ప్రమాదంలోకి నెట్టేశారంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ సందర్భంగా సినీ నటుడు, జనసేన నేత నాగబాబు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, 'దేశ వ్యాప్తంగా నిన్న విడుదలైన వారుణి వాహిని సూపర్ హిట్ అయింది. సెన్సేషనల్ టాక్ సంపాదించుకుంది. బాహుబలి, టైటానిక్ కలెక్షన్లను దాటేలా ఉంది. భారీ వసూళ్లను రాబడుతోంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం... యూపీలో రూ. 100 కోట్లు, ఏపీలో రూ. 68 కోట్లు, కర్ణాటకలో రూ. 45 కోట్లు. మిగతా రాష్ట్రాల కలెక్షన్ రిపోర్టులు రావాల్సి ఉంది. ప్రభుత్వాల నిర్ణయాలను మందుబాబులు మెచ్చుకుంటున్నారు. మహిళలు మాత్రం ప్రభుత్వాలను శపిస్తున్నారు. లాక్ డౌన్ పై మోదీ స్ఫూర్తి అత్యున్నత స్థాయిలో ఉంది. ప్రభుత్వ నిర్ణయాలతో కరోనా చాలా సంతోషంగా ఉంది. కేంద్రం, రాష్ట్రాల నుంచి ఇదే సహకారాన్ని కరోనా కోరుకుంటోంది' అంటూ ఎద్దేవా చేశారు.