Kesineni Nani: 'అమ్మ ఒడి' పథకం డబ్బులు 'నాన్న గొంతు తడి' పథకం కోసం ఖర్చవుతున్నాయి: కేశినేని నాని సెటైర్
- ఏపీలో తెరుచుకున్న మద్యం దుకాణాలు
- తొలిరోజు పోటెత్తిన మందుబాబులు
- అమ్మలు వాపోతున్నారు జగనన్నా అంటూ నాని ట్వీట్
కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఏపీలోనూ మద్యం అమ్మకాలు మొదలయ్యాయి. లాక్ డౌన్ కారణంగా ఇన్నాళ్లు మౌనం పాటించిన మందుబాబులు, నిన్నటి నుంచి మద్యం దుకాణాలకు పోటెత్తుతున్నారు. కొన్నిచోట్ల కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లు దర్శనమిచ్చాయి.
దీనిపై టీడీపీ ఎంపీ కేశినేని నాని తనదైన శైలిలో స్పందించారు. 'అమ్మ ఒడి' పథకం డబ్బులు 'నాన్న గొంతు తడి' పథకం కోసం ఖర్చయిపోతున్నాయని అమ్మలు వాపోతున్నారు జగనన్నా అంటూ ట్వీట్ చేశారు. అంతకుముందు ఆయన మరో ట్వీట్ లోనూ విమర్శనాత్మకంగా స్పందించారు. లాక్ డౌన్ నేపథ్యంలో హోటళ్లు లేవని, టీ దుకాణాలు, కాఫీ షాపులు అన్నీ మూతపడినా, జగనన్న మందు షాపులు మాత్రం ఫుల్ టైమ్ ఓపెన్ అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఈ రాష్ట్రాన్ని దేవుడే రక్షించాలని వ్యాఖ్యానించారు.