Ambati Rambabu: మద్యం తాగొద్దని చెప్పాలి కానీ, బ్రాండ్ల గురించి మాట్లాడతారా?: చంద్రబాబుపై అంబటి ధ్వజం
- ఏపీలో మద్యం అమ్మకాలు షురూ
- వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటలయుద్ధం
- ప్రజలకు మద్యం అలవాటు చేసిందే చంద్రబాబు అన్న అంబటి
తమ ప్రభుత్వం మద్యపాన నిషేధానికి కట్టుబడి ఉందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పష్టం చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో నెలన్నర రోజుల తర్వాత మద్యం అమ్మకాలు షురూ అవడంతో అధికార, విపక్షాల మధ్య మాటలయుద్ధం మొదలైంది.
దక్షిణాదిన ఏ రాష్ట్రం కూడా మద్యం దుకాణాలు తెరవలేదని, ఏపీలో అమ్మే మద్యం బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలపై అంబటి తీవ్రంగా స్పందించారు. మద్యం రేట్లు పెంచడం ద్వారా డబ్బున్న వాళ్లు మాత్రమే తాగే పరిస్థితులు తీసుకువస్తామని, క్రమంగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పారు. కానీ చంద్రబాబు మద్యం తాగొద్దని చెప్పకుండా, బ్రాండ్ల గురించి మాట్లాడడం ఏంటని అంబటి రాంబాబు మండిపడ్డారు.
"ఇలాంటి ఆపద సమయంలో ధరలు పెంచడం మంచిదా? అని చంద్రబాబు అంటున్నారు. మద్యం ఏమైనా నిత్యావసర వస్తువా? చంద్రబాబు సహా టీడీపీ నేతలందరూ మద్యం తాగొద్దంటూ ఉద్యమం చేయండి. అంతేతప్ప మద్యం ధరలు పెంచారంటూ, బ్రాండ్లు బాగాలేవంటూ ఉద్యమాలు చేయకండి.
బ్రాండ్ల గురించి మాట్లాడుతూ నీచ సంస్కృతికి దిగజారుతారా? అయినా, చంద్రబాబు బాధ ఏంటో అర్థం కావడంలేదు. మీడియాలో కనిపించడానికే చంద్రబాబు పాట్లు. కేంద్రమే మద్యం అమ్మకాలపై నిర్ణయం తీసుకుంది. కేంద్రాన్ని చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదు. అసలు, ప్రజలకు మద్యం అలవాటు చేసిందే చంద్రబాబు. మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచారు" అంటూ విమర్శలు గుప్పించారు.