Koyambedu Market: కరోనా మహమ్మారికి మరో చిరునామాగా నిలుస్తున్న చెన్నై కోయంబేడు మార్కెట్!

Chennai Koyambedu market causes corona super spreading

  • అనేక జిల్లాల్లో కరోనా కేసులకు కోయంబేడు లింకు
  • ఇక్కడికి వచ్చి వెళ్లిన వాళ్లకు వైరస్
  • రెడ్ జోన్ లోకి పలు జిల్లాలు

చెన్నైలో 65 ఎకరాల్లో కొలువుదీరిన కోయంబేడు హోల్ సేల్ మార్కెట్ తమిళనాడు వ్యాప్తంగా ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. వ్యవసాయ, ఫల ఉత్పత్తులు, పూలు, కూరగాయలు... ఇలా అనేక రకాలుగా ఇక్కడ వ్యాపార కార్యకలాపాలు సాగుతుంటాయి. ఈ మార్కెట్లో ఉద్యోగం అంటే అదొక భరోసాగా ఇప్పటివరకు భావించేవారు. అంతటి పేరున్న కోయంబేడు మార్కెట్ ఇప్పుడు కరోనా కారణంగా మసకబారింది. తమిళనాడులో పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులకు కోయంబేడు లింకు ఉండడమే అందుకు కారణం. కోయంబేడు దెబ్బకు జిల్లాలకు జిల్లాలే రెడ్ జోన్ లోకి వెళ్లిపోయాయి.

ఉత్తర తమిళనాడులోని కడలూర్ నుంచి దక్షిణ ప్రాంతంలోని దిండిగల్ వరకు ఇక్కడికి నిత్యం వేలమంది రాకపోకలు సాగిస్తుంటారు. వ్యవసాయోత్పత్తుల ట్రక్కులతో ఈ మార్కెట్ ఎప్పుడూ కిక్కిరిసి ఉంటుంది. ఇదే కరోనా పాలిట అనుకూలమైంది. కడలూర్ లో తాజాగా 122 మందికి కరోనాగా నిర్ధారణ కాగా వారందరూ ఇటీవల కోయంబేడు మార్కెట్ ను సందర్శించిన వాళ్లేనని గుర్తించారు. కోయంబేడుతో సంబంధం ఉన్న మరో 450 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

ఇక ఈ మార్కెట్ కు వచ్చి వెళ్లిన విల్లుపురం వాసుల్లో 49 మందికి కరోనా సోకినట్టు పరీక్షల్లో తేలింది. అంతకుముందు మరో 33 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కడలూరు, విల్లుపురం మాత్రమే కాదు, దిండిగల్, తెన్ కాశి ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. దాంతో ఆయా ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించారు. లాక్ డౌన్ కు ముందు అనేకమంది గ్రామీణ ప్రాంతాల ప్రజలు మార్కెట్ కు రావడం, లాక్ డౌన్ తర్వాత ఇక్కడి కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోవడం వంటి కారణాలతో కరోనా వ్యాప్తి చెందినట్టు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News