France: డిసెంబర్ లోనే ఫ్రాన్స్ లో మహమ్మారి.. రీ టెస్టుల్లో వెల్లడి!
- డిసెంబర్ 27న ఫ్లూ లక్షణాలతో ఆసుపత్రికి వ్యక్తి
- చికిత్స చేసి పంపిన పారిస్ ఆసుపత్రి వైద్యులు
- పునః పరీక్షల్లో కరోనా వైరస్ ఆనవాళ్లు
- తొలి కేసు నమోదు కావడానికి నెల రోజుల ముందే ఘటన
జనవరి నెలాఖరులో ఫ్రాన్స్ లోకి కరోనా మహమ్మారి ప్రవేశించి, అధికారికంగా తొలి కేసు నమోదు కాగా, అంతకు నెల రోజుల ముందే వైద్యులు అది కరోనా అని తెలియకుండానే ఓ న్యూమోనియా రోగికి వైద్యులు చికిత్స చేశారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
న్యుమోనియా సోకిందన్న కారణంతో ఆసుపత్రికి వచ్చి, చికిత్స తరువాత వెళ్లిపోయిన రోగుల శాంపిల్స్ ను తిరిగి పరీక్షించగా, వాటిల్లో కరోనా పాజిటివ్ కనిపించింది. పారిస్ ఉత్తర ప్రాంతంలోని ఎవిసెన్స్ అండ్ జీన్ వెర్డియర్ హాస్పిటల్ హెడ్ వ్యూస్ కోహెన్ 'బీఎఫ్ఎం టీవీ'కి ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. మొత్తం 24 మంది శాంపిల్స్ ను మరోసారి పరీక్షించామని ఆయన తెలిపారు. ఈ 24 మందిలో ఒకరికి కొవిడ్ వచ్చిందని, అతను డిసెంబర్ 27న ఆసుపత్రిలో చేరాడని తెలిపారు.
తొలి దశలో పీసీఆర్ టెస్టింగ్ కిట్లను వినియోగించి, వారిలో ఫ్లూ వైరస్ ను కనుగొనే ప్రయత్నం చేశామని, ఈ విధానంలో కొంత జన్యుపరమైన పరీక్షలు కూడా చేశామని, కరోనా గురించి అప్పట్లో తెలియలేదని అన్నారు. ఆ వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందో తేల్చడానికి.. పునఃపరీక్షల్లో డిసెంబర్ 27నే కరోనా సోకివున్న వ్యక్తి అత్యంత కీలకమని కోహెన్ అభిప్రాయపడ్డారు. సదరు పేషంట్ రికవరీ అయ్యాడని, అతను ఎలా ఇన్ ఫెక్ట్ అయ్యాడోనన్న విషయం ఇప్పుడు తమకు ఆశ్చర్యకరంగా అనిపిస్తోందని తెలిపారు. అతను ఎక్కడికీ ప్రయాణం చేయలేదని, అతని భార్య మినహా మరొకరితో కాంటాక్టులో కూడా లేడని స్పష్టం చేశారు.
ఆమె మాత్రం, కొందరు చైనా సంతతి నిర్వహిస్తున్న దుకాణం పక్కన పని చేస్తూ ఉండేవారని, వారిలో ఎవరైనా చైనాకు ప్రయాణం చేసి, అక్కడి నుంచి వైరస్ ను తీసుకుని వచ్చారా? అన్న విషయమై ఆరా తీస్తున్నామని తెలిపారు. ఆమెకు కరోనా వైరస్ సోకిందా? అన్న విషయంలోనూ ఇంతవరకూ స్పష్టత లేదని తెలిపారు. గతంలో సేకరించిన అన్ని శాంపిల్స్ నూ తిరిగి పరీక్షించి, వైరస్ ఎప్పుడు మొదలైందన్న విషయాన్ని మరోమారు నిర్ధారిస్తామని ఆయన వెల్లడించారు.