Mahesh Babu: నీకు నేనున్నాను సోదరా!: విజయ్ దేవరకొండకు మహేశ్ బాబు బాసట

Mahesh Babu comes to support Vijay Devarakonda

  • కొన్ని వెబ్ సైట్లపై విజయ్ దేవరకొండ ఆగ్రహం
  • తన కెరీర్ నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపణలు
  • ట్విట్టర్ లో స్పందించిన మహేశ్ బాబు

ఓ నాలుగు వెబ్ సైట్లు తన సినీ కెరీర్ ను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్విట్టర్ లో స్పందించారు. నీకు నేను అండగా ఉంటాను సోదరా అంటూ విజయ్ దేవరకొండకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు ఆవేశపూరిత వ్యాఖ్యలతో కూడిన సందేశాన్ని కూడా వెలువరించారు.

"ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ, కృషి, ఓర్పు, తపన, త్యాగాల ఫలితంగా ఇవాళ ప్రజల నుంచి గౌరవం, ప్రేమ పొందగలుగుతున్నాం. అదే సమయంలో ఓ భార్య కోరుకునే మంచి భర్తగా ఉండేందుకు కష్టపడతాం, మా నాన్న సూపర్ హీరో అని పిల్లలు భావించాలని తపించిపోతాం. ఫ్యాన్స్ కోసం సూపర్ స్టార్ లా ఉండాలని కోరుకుంటాం. మేం ఇన్నివిధాలుగా కష్టపడుతుంటే, ఎవడో ముక్కూమొహం తెలియనివాడు, డబ్బుకోసం ఏమైనా చేసేవాడు వచ్చి మమ్మల్ని అగౌరవపరుస్తూ, పాఠకులకు అవాస్తవాలు నూరిపోస్తూ, దుష్ప్రచారం సాగిస్తుంటాడు. ఇదంతా కూడా డబ్బు కోసమే!

ఇలాంటివాళ్ల బారి నుంచి తెలుగు సినిమాకు చెందిన ఈ అందమైన పరిశ్రమను కాపాడుకోవాలనుకుంటున్నాను. నా అభిమానులను, నా పిల్లలను ఇలాంటి దురాలోచనలతో కూడిన ప్రపంచం నుంచి రక్షించుకోవాలనుకుంటున్నాను. మాపై ఆధారపడి, మా జీవితాలనే కించపరిచేలా అబద్ధపు ప్రచారాలు చేస్తున్న ఇలాంటి ఫేక్ వెబ్ సైట్లపై చర్యలు తీసుకోవాలని చిత్ర పరిశ్రమను కోరుతున్నాను" అంటూ మహేశ్ బాబు తన లేఖలో ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. ఫేక్ న్యూస్ ను నిర్మూలించండి, గాసిప్ వెబ్ సైట్లను అంతమొందించండి అంటూ పిలుపునిచ్చారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News