Roja: మద్యం ధరలు పెంచడానికి కారణం ఇదే: రోజా
- మద్యపాన నిషేధంలో భాగంగానే ధరల పెంపు
- ధర పెరిగితే పేదవాడు మద్యానికి దూరమవుతాడు
- ఇప్పటికే 20 శాతం వైన్లు, 40 శాతం బార్లను తొలగించాం
దాదాపు 40 రోజుల తర్వాత ఏపీలో మద్యం అమ్మకాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. అయితే మద్యం ధరలను రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 25 శాతం పెంచేసింది. దీంతో ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షం తీవ్ర విమర్శలు చేస్తోంది. ఆదాయం కోసం ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారని విపక్ష నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ మద్యపాన నిషేధంలో భాగంగానే మందు ధరలను పెంచామని చెప్పారు.
ధరలు పెంచితేనే పేదవారు మద్యానికి దూరమవుతారని రోజా అన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో మద్యం ఏరులై పారిందని విమర్శించారు. జగన్ సీఎం అయిన తర్వాత మద్యనిషేధానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే 40 వేల బెల్టు షాపులు, 20 శాతం వైన్లు, 40 శాతం బార్లను తొలగించామని తెలిపారు. టీడీపీ నేతలు ఏసీ గదుల్లో కూర్కొని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.