India: లాక్ డౌన్ ఎఫెక్ట్... ఎన్నడూ లేనంతగా కుదేలైన భారత ఉత్పత్తి రంగం
- దేశ ఆర్థిక వ్యవస్థపై లాక్ డౌన్ భారం
- నిలిచిపోయిన తయారీ రంగం
- ఏప్రిల్ లో 27.4కి పడిపోయిన పీఎంఐ
అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ ను ఎదుర్కొనే క్రమంలో భారత్ లో విధించిన లాక్ డౌన్ సత్ఫలితాలను ఇస్తున్నా, దేశ ఆర్థిక వ్యవస్థపై పెనుప్రభావం చూపుతోంది. భారత ఉత్పత్తి రంగం రికార్డు స్థాయి క్షీణత చవిచూస్తోంది. ఎన్నడూ లేనంతగా దేశీయ తయారీ రంగం పాతాళానికి పడిపోయింది.
ఎక్కడికక్కడ ఆంక్షలు, అనేక సంస్థలు ఉద్యోగులను తగ్గించుకోవడం, రవాణా పరిమితులు వంటివి ఉత్పత్తి రంగాన్ని దెబ్బతీసినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) పతనమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. మార్చిలో 51.8గా ఉన్న పీఎంఐ, ఏప్రిల్ నెలలో 27.4కి పడిపోయింది.
పీఎంఐ డేటా సేకరించడం మొదలైన 15 ఏళ్లలో ఇదే అత్యంత భారీ పతనం అని ప్రముఖ విశ్లేషణ సంస్థ ఐహెచ్ఎస్ మార్కిట్ వెల్లడించింది. వరుసగా 32 మాసాల పాటు అభివృద్ధి పథంలో నిలిచిన భారత ఉత్పత్తి రంగం కొన్నిరోజుల వ్యవధిలోనే కుచించుకుపోయిందని మార్కిట్ వివరించింది. కొత్త బిజినెస్ ఆర్డర్లు లేక కంపెనీలు డీలాపడిపోయాయని, గత రెండున్నరేళ్లలో ఈ తరహా పరిణామం ఇదే ప్రథమం అని పేర్కొంది.