Aravind Kezriwal: కరోనాతో సహజీవనం చేసేందుకే నిర్ణయం... లాక్ డౌన్ తొలగించేందుకు సిద్ధమన్న అరవింద్ కేజ్రీవాల్!
- దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేత
- ఇప్పటికే పలు సెక్టార్లకు అనుమతులు
- కేసులు పెరిగితే ఎదుర్కొనేందుకు సిద్ధమన్న ఢిల్లీ సీఎం
కరోనా వైరస్ మహమ్మారితో కలిసి సహజీవనం చేయాల్సిందేనని నిర్ణయించుకున్నామని, లాక్ డౌన్ నిబంధనలను తొలగించేందుకు సిద్ధంగా ఉన్నామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, ఢిల్లీలో అన్ని రకాల కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. రాష్ట్ర పరిధిలో ఇంతవరకూ 4,122 కరోనా కేసులు నమోదైనాయని, 1,256 మంది రికవరీ అయ్యారని, మరో 64 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
ఢిల్లీలో దశలవారీగా లాక్ డౌన్ ను తొలగిస్తూ వెళ్తామని తెలిపిన ఆయన, కంటైన్ మెంట్ జోన్లలో మాత్రం ఆంక్షలు కొనసాగుతాయని అన్నారు. ఇదే విషయాన్ని తాను కేంద్రానికి కూడా స్పష్టం చేశానని, గ్రీన్ జోన్లలో ఉన్న అన్ని షాపులనూ, సరి - బేసి విధానంలో తిరిగి తెరచుకోవచ్చని, ఈ ప్రాంతాల్లో సమీప భవిష్యత్తులో కొన్ని కేసులు పెరిగినా, పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నామని స్పష్టం చేశారు. ప్రైవేటు కార్యాలయాల్లో 33 శాతం సిబ్బంది ఉండవచ్చని, ఐటీ హార్డ్ వేర్ సంస్థలు, నిత్యావసర వస్తువుల తయారీ, ప్రాసెసింగ్ కేంద్రాలపై ఆంక్షలుండవని అన్నారు.
వీటితో పాటు ఐటీ సేవలు, కాల్ సెంటర్లు ప్రైవేట్ సెక్యూరిటీ సేవలు, వేర్ హౌస్ లు తదితరాలు కొనసాగవచ్చని, రాజధానిలో అతిపెద్ద మార్కెట్లు అయిన కన్నాట్ ప్లేస్, ఖాన్ మార్కెట్ తదితరాలను మాత్రం ఇప్పుడే తెరవబోమని అన్నారు. మద్యం షాపులకు అనుమతించ లేదని కేజ్రీవాల్ పేర్కొన్నారు. స్వయం ఉపాధిని పొందుతున్న టెక్నీషియన్స్, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్స్, పని మనుషులు తమ రోజువారీ కార్యకలాపాల్లో నిమగ్నం కావచ్చని స్పష్టం చేశారు.