Liquor: దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తెరచుకున్న మద్యం దుకాణాలు!
- లిక్కర్ కోసం భారీ ఎత్తున క్యూ కట్టిన ప్రజలు
- భౌతిక దూరం పాటించడం లేదని విమర్శలు
- బారికేడ్లు ఏర్పాటు చేసిన షాపుల యజమానులు
ఎన్నాళ్లో వేచిన ఉదయం... నేడు తిరిగి వచ్చినట్లయింది మందు బాబులకు. కేంద్రం ఆదేశాల మేరకు ఈ ఉదయం దేశంలోని పలు ప్రాంతాల్లో మద్యం షాపులు ఓపెన్ అయ్యాయి. దాదాపు 7 వారాల తరువాత షాపులు తెరిచేసరికి మద్యం షాపుల వద్ద జనాలు భారీ ఎత్తున లిక్కర్ కోసం క్యూ కట్టారు. కస్టమర్ల మధ్య భౌతిక దూరం తప్పనిసరని అధికారులు స్పష్టం చేసినా, దాన్ని పాటించడాన్ని మాత్రం జనాలు మరచిపోయారు. కొన్ని ప్రాంతాల్లో మద్యం కోసం కిలోమీటర్ల కొద్దీ ప్రజలు క్యూ లైన్ లో నిలబడ్డారు.
కర్ణాటకలో ఉదయం 9 గంటలకే షాపులను తెరిచారని తెలుస్తోంది. ఇక్కడ షాపుల వద్ద ప్రత్యేక బారికేడ్లను ఏర్పాటు చేశారు. దుకాణాల ముందు సర్కిళ్లను గీసి, మందు బాబులు వాటిల్లోనే నిలిచే ఏర్పాట్లు చేశారు. ఇక, ఈ ఉదయం నుంచే షాపుల వద్దకు వందలాది మంది చేరిపోయారు. తెల్లవారుజామునే కస్టమర్లు రావడం మొదలయ్యే సరికి, అప్పటికే లాక్ డౌన్ అమలు విధుల్లో బిజీగా ఉన్న పోలీసులకు మరో కొత్త పని వచ్చి పడింది. మందుబాబులను కంట్రోల్ చేయలేక వారు అవస్థలు పడుతున్నారు.
కాగా, ఏపీలోని విశాఖపట్నం సహా పలు ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఓపెన్ అయ్యాయి. షాపుల్లో స్టాక్ తక్కువగా ఉందని, డిమాండ్ మేరకు అందరికీ కావాల్సిన లిక్కర్ ను అందిస్తామని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. అవసరం ఉన్న చోటకు అదనపు స్టాక్స్ ను పంపుతున్నామని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా షాపులను ఓపెన్ చేయలేదని, లోపల ఉన్న స్టాక్ ను పరిశీలించిన తరువాత అమ్మకాలు ప్రారంభం అవుతాయని అధికారులు స్పష్టం చేశారు.