Sounds: శబ్ద కాలుష్యంతో కేన్సర్.. తాజా అధ్యయనంలో వెల్లడి
- జర్మనీలో జరిగిన పరిశోధనలో వెల్లడి
- జన్యువులలో మార్పులకు కారణం అవుతున్న శబ్దాలు
- నాలుగు రోజులు కూడా విమాన శబ్దాలను తట్టుకోలేకపోయిన ఎలుకలు
శబ్ద కాలుష్యం వల్ల అధిక రక్తపోటు (హైబీపీ), కేన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని జర్మనీలోని ‘యూనివర్సిటీ మెడికల్ సెంటర్ ఆఫ్ మెయింజ్’ విశ్వవిద్యాలయం జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. వాహనాలు, పరిశ్రమల నుంచి వచ్చే శబ్దాలతోపాటు విమానాశ్రయాల్లో విమానాల ల్యాండింగ్, టేకాఫ్ సందర్భంగా వచ్చే శబ్దాలు జన్యువులు అంటే కేన్సర్ సంబంధిత డీఎన్ఏలలో మార్పులకు కారణం అయ్యే అవకాశం ఉందని తేల్చింది. ఈ ధ్వనులు, వాయుకాలుష్యం అధిక రక్తపోటు, కేన్సర్‌కు దారితీసే అవకాశం ఉందని తెలిపింది.
ఎలుకలపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెలుగుచూసినట్టు అధ్యయనకారులు వెల్లడించారు. నాలుగు రోజులు కూడా విమాన శబ్దాలను ఎలుకలు తట్టుకోలేకపోయాయని, వాటిలో హైబీపీ, గుండె సంబంధిత సమస్యలతోపాటు కేన్సర్‌కు కారణమయ్యే డీఎన్ఏ దెబ్బతిన్నదని గుర్తించినట్టు పరిశోధనలకు నేతృత్వం వహించిన మథాయాస్ ఉల్జే వెల్లడించారు.