Shi Zhengli: కరోనా నేపథ్యంలో కనిపించకుండా పోయిన చైనా 'బ్యాట్ ఉమన్' మళ్లీ వచ్చింది!

Chinese Bat Woman Shi Zhengli returns
  • వుహాన్ వైరాలజీ సంస్థలో గబ్బిలాలపై పరిశోధనలు చేస్తున్న షీ ఝెంగ్లీ
  • బ్యాట్ ఉమన్ గా ఫేమస్
  • పాశ్చాత్య దేశాలకు రహస్యాలు చేరవేసిందంటూ ఆరోపణలు
  • అలాంటి చర్యలకు పాల్పడబోనని స్పష్టీకరణ
చైనాలో గత డిసెంబరు చివరి వారంలో కరోనా బీభత్సం మొదలయ్యాక ఆశ్చర్యకర పరిణామం చోటుచేసుకుంది. వుహాన్ లో ఉన్న ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో సీనియర్ సైంటిస్టుగా పనిచేస్తున్న షీ ఝెంగ్లీ ఉన్నట్టుండి అదృశ్యమైంది. గబ్బిలాలపై పరిశోధనలు సాగించడం అంటే ఆమెకు అత్యంత మక్కువ. అందుకే ఆమెను అందరూ బ్యాట్ ఉమన్ అని పిలుస్తారు. అయితే, కరోనా నేపథ్యంలో ఆమె కనిపించకుండా పోవడంతో అనేక ఊహాగానాలు వినిపించాయి. పాశ్చాత్యదేశాలకు వుహాన్ వైరాలజీ ల్యాబ్ గుట్టుమట్లు చెప్పేసిందని, అందుకే అమెరికా వంటి దేశాలు చైనా వైపు వేలెత్తి చూపిస్తున్నాయని కొన్ని వాదనలు వినిపించాయి.

అయితే ఇలాంటి సందేహాలన్నింటికి చెక్ పెడుతూ, షీ ఝెంగ్లీ సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఇటీవలి తన ఫొటోలను పోస్టు చేసింది. తనకు, తన కుటుంబానికి ఏమీ కాలేదని స్పష్టం చేసింది. తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం అని, పాశ్చాత్య సమాజానికి రహస్యాల చేరవేత అనేది అసత్య ప్రచారం అని కొట్టిపారేసింది. ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా అలాంటి చర్యలకు పాల్పడబోనని, తాము ఎలాంటి తప్పు చేయలేదని పేర్కొంది.

సైన్స్ పై తనకు బలీయమైన నమ్మకం ఉందని, మబ్బులన్నీ తొలగిపోయి సూర్యుడు మిలమిల ప్రకాశించే రోజు కోసం వేచి చూస్తున్నామని తెలిపింది. కాగా, కరోనా వైరస్ వుహాన్ సమీపంలోని గబ్బిలాల ద్వారానే వ్యాప్తి చెంది ఉండొచ్చని బలమైన వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
Shi Zhengli
Bat Woman
China
Corona Virus
Bats

More Telugu News