Ramagaundam: రామగుండంలో ఎన్టీపీసీ వలస కార్మికుల ఆందోళన!
- స్వరాష్ట్రాలకు పంపించాలని వలస కార్మికుల డిమాండ్
- యూపీ, ఎంపీ, ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్ ల వలస కార్మికుల బైఠాయింపు
- రెండు రోజుల్లో వారిని సొంత రాష్ట్రాలకు పంపుతామని ఎమ్మెల్యే హామీ
తమను స్వరాష్ట్రాలకు పంపించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా రామగుండంలో వలసకార్మికులు ఆందోళనకు దిగారు. ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టులో పని చేస్తున్న వలస కార్మికులు స్థానిక రాజీవ్ రహదారిపైకి చేరుకుని ధర్నాకు దిగారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు చెందిన కూలీలు దాదాపు నాలుగు వందల మంది ఈ ధర్నాలో పాల్గొన్నారు.
ఈ విషయం తెలుసుకున్న రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. రెండు రోజుల్లో వారిని సొంత రాష్ట్రాలకు పంపుతామని ఆయన హామీ ఇవ్వడంతో వలస కార్మికులు తమ ధర్నా విరమించారు.
కాగా, తమ స్వరాష్ట్రాలకు పంపాలని కోరుతూ నిన్న స్థానిక పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయమై ఆరా తీసేందుకు ఇవాళ మళ్లీ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. కొంత సమయం పడుతుందని పోలీసులు చెప్పడంతో అసహనానికి గురైన వలస కార్మికులు ఆందోళనకు దిగారు.