Corona Virus: గాల్లో ఎగరనున్న సుఖోయ్, మిగ్, జాగ్వార్ ఫైటర్లు... నేడు మిద్దెల మీదకు ఎక్కితే కనువిందు!

Fighter Jets and Choppers fly for Doctors

  • గాల్లో విన్యాసాలు చేయనున్న విమానాలు
  • కరోనాపై పోరాడుతున్న డాక్టర్లకు సంఘీభావం
  • పలు నగరాల్లోని ఆసుపత్రుల వద్ద పుష్ప వర్షం
  • ప్రజలు తిలకించేందుకు అవకాశం

కరోనాపై పోరాటంలో ప్రాణాలకు తెగించి, ముందు నిలిచి పోరాటం చేస్తున్న వైద్య, పోలీసు, మీడియా రంగంలోని వారికి సెల్యూట్ చేసేందుకు నేడు యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఆకాశంలో పరేడ్ చేస్తూ, పూలవర్షం కురిపించనుండగా, దేశంలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఈ దృశ్యాలను ప్రత్యక్షంగా తిలకించే అవకాశాలున్నాయి. డాక్టర్లకు సంఘీభావం తెలుపుతూ, వారు చేసే సేవలను అభినందించేందుకు, ఈ ఉదయం 10 గంటల నుంచి 10.30 గంటల వరకూ ఫైటర్ విమానాలైన సుఖోయ్ - 30, మిగ్ - 29, జాగ్వార్ తదితర విమానాలు, ఫైటర్ చాపర్లు ఢిల్లీ, హైదరాబాద్, ముంబయి, బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లో ఆకాశ పరేడ్ ను నిర్వహించనున్నాయి.

ఇదే సమయంలో భారత వాయుసేన దేశంలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో విన్యాసాలు చేస్తూ, పుష్ప వర్షం కురిపించనుంది. ఈ కార్యక్రమం గురించి వెల్లడించిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్ ఇంద్రనీల్ నంది, "రోటీన్ శిక్షణలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మా విమానాలు పలు నగరాలపై ఎగురుతాయి. దేశంలో కరోనా వైరస్ ప్రబలకుండా వాయుసేన సైతం ఎన్నో చర్యలు చేపట్టింది. దేశీయంగా, అంతర్జాతీయంగా నిత్యావసరాలు, వైద్య పరికరాలను రవాణా చేశాము" అని వెల్లడించారు.

కాగా, భారత వాయుసేన ఇప్పటివరకూ 600 టన్నుల వైద్య పరికరాలను రవాణా చేయడంతో పాటు డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బందిని ఎంతో మందిని తమ తమ ప్రాంతాల నుంచి ప్రధాన నగరాల్లోని ఆసుపత్రులకు, టెస్టింగ్ ల్యాబ్ లకు చేర్చింది. కాగా, నేటి వాయుసేన విన్యాసాల్లో అమెరికాకు చెందిన సీ-130 ఎయిర్ క్రాఫ్ట్ న్యూఢిల్లీ వాసులకు ప్రత్యేక ఆకర్షణ కానుంది. 500 మీటర్ల నుంచి 1000 మీటర్ల ఎత్తున ఈ విమానం ఎగురుతూ వెళుతుందని అధికారులు వెల్లడించారు. ప్రధాన ఆసుపత్రులు ఉండే ప్రాంతాల్లో ఇవి పూలు చల్లనున్నాయి. హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిపై హెలికాప్టర్లు పూల వర్షం కురిపించనున్నాయి.

  • Loading...

More Telugu News