Rahul Gandhi: 'ఆరోగ్య సేతు' యాప్ పై తీవ్ర ఆరోపణలు చేసిన రాహుల్ గాంధీ
- ఇదో సరికొత్త నిఘా యాప్ అని రాహుల్ ఆరోపణ
- ఓ ప్రైవేటు వ్యక్తికి అప్పగించారని ట్వీట్
- డేటా భద్రతపై ఆందోళన
కరోనా రోగులు సమీపంలోకి వచ్చినప్పుడు అప్రమత్తం చేసే యాప్ గా కేంద్రం ప్రచారం చేస్తున్న 'ఆరోగ్య సేతు' యాప్ లక్షల్లో డౌన్ లోడ్ అవుతోంది. అయితే ఈ యాప్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో స్పందించారు.
'ఆరోగ్య సేతు' యాప్ ఓ అధునాతన నిఘా వ్యవస్థ అని ఆరోపించారు. వ్యవస్థీకృత పర్యవేక్షణ లేకుండానే దీని నిర్వహణ బాధ్యతలను ఓ ప్రైవేటు ఆపరేటర్ కు అప్పగించారని విమర్శించారు. ఈ లోపభూయిష్ట విధానం కారణంగా డేటాభద్రతపై తీవ్ర ఆందోళన కలుగుతోందని, ప్రజల వ్యక్తిగత సమాచారంపై భరోసా కనిపించడం లేదని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
"సాంకేతిక పరిజ్ఞానం అనేది మనల్ని సురక్షితంగా ఉంచాలి. కానీ, ప్రజల అనుమతి లేకుండా వారిపై నిఘా ఉంటుందన్న భయాలను మాత్రం కలిగించకూడదు" అని ఘాటుగా స్పందించారు.