Kim Jong Un: కిమ్ ప్రజల ముందుకు వచ్చిన వీడియో ఇదిగో!
- 20 రోజులుగా కిమ్ ఉనికిపై సందేహాలు
- ఆరోగ్యం క్షీణించిందంటూ ప్రచారం
- ఎరువుల కర్మాగారం ఓపెనింగ్ కు విచ్చేసిన కిమ్
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఉనికిపై నెలకొన్న సందేహాలు అన్నీఇన్నీ కావు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని, పాలనా పగ్గాలు ఆయన సోదరి కిమ్ యో జోంగ్ అందుకోనుందని విపరీతమైన ప్రచారం జరిగింది. అయితే వాటన్నింటికి తెరదించుతూ కిమ్ నిక్షేపంగా ఉన్నాడంటూ ఉత్తర కొరియా కొంత ఫుటేజ్ ను బయటపెట్టింది. ప్యాంగ్ యాంగ్ లోని ఓ ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవంలో కిమ్ పాల్గొన్నాడంటూ అక్కడి అధికారిక మీడియా వెల్లడించింది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో కూడా వచ్చేసింది.
ఈ వీడియోలో కిమ్ ముందు నడుస్తుండగా, కాస్త వెనుకగా సోదరి, అటూ ఇటూ అంగరక్షకులు కదిలి వచ్చారు. ఈ వీడియో నిజమైనదే అనేందుకు ఆధారంగా, కిమ్ అంగరక్షకులు, అధికారులు, ప్రజలు కరోనా వైరస్ రక్షణ కోసం మాస్కులు ధరించి ఉన్నారు. మొత్తమ్మీద గత 20 రోజుల్లో కిమ్ పబ్లిక్ గా దర్శనమివ్వడం ఇదే ప్రథమం కావడంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక కిమ్ రాకను స్వాగతిస్తూ పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలు జెండాలు ఊపుతూ హర్షాతిరేకాలు చేస్తుండడం కూడా వీడియోలో కనిపించింది.