Liquor: మందుబాబులకు శుభవార్త... గ్రీన్ జోన్లలో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్!
- షరతులతో కూడిన అనుమతి
- ఒక్కొక్కరికి మధ్య 6 అడుగుల దూరం
- షాపు వద్ద ఐదుగురి కంటే ఎక్కువమంది ఉండరాదని వెల్లడి
కరోనా వ్యాప్తిని నివారించే క్రమంలో కేంద్రం లాక్ డౌన్ ను మరో రెండు వారాల పాటు పొడిగించిన సంగతి తెలిసిందే. తాజా లాక్ డౌన్ మే 17 వరకు అమల్లో ఉంటుందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. అయితే, ఈ సందర్భంగా కరోనా కేసులు లేని గ్రీన్ జోన్లలో భారీగా సడలింపులు ప్రకటించింది. గ్రీన్ జోన్లలో మద్యం అమ్మకాలకు, పాన్ దుకాణాలకు ఓకే చెప్పింది.
అయితే, విధిగా ఒక్కొక్కరికి మధ్య 6 అడుగుల దూరం ఉండాలని, దుకాణం వద్ద ఒక్కసారి ఐదుగురు వ్యక్తుల కంటే ఎక్కువమంది ఉండరాదని స్పష్టం చేసింది. ఇది గ్రీన్ జోన్ల వరకే వర్తిస్తుందని కేంద్రం పేర్కొంది. కరోనా కేసులు అధికంగా ఉండే రెడ్ జోన్లలో ఎలాంటి సడలింపులు ఉండవని, ఓ మోస్తరు కేసులుండే ఆరెంజ్ జోన్లలో మద్యం షాపులపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చని వెసులుబాటు కల్పించింది. అంతేకాదు, గ్రీన్ జోన్లలో అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతి ఇస్తూ, 50 శాతం ప్రయాణికులతో బస్సులు తిప్పేందుకు కూడా కేంద్రం అనుమతించింది.