Sramik: శ్రామిక ప్రత్యేక రైళ్లు నడపాలని కేంద్రం నిర్ణయం
- వలస కార్మికుల కోసం కేంద్రం చర్యలు
- రైలు సేవలు వినియోగించుకునేలా మార్గదర్శకాల్లో సవరణలు
- ఉత్తర్వులు జారీ చేసిన హోంమంత్రిత్వ శాఖ
కరోనా నియంత్రణ చర్యల్లో ప్రధానంగా లాక్ డౌన్ విధించడంతో వలస కార్మికుల పరిస్థితి దయనీయంగా మారడంతో కేంద్రం ఆలస్యంగానైనా సానుకూలంగా స్పందించింది. వారు స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. అయితే, బస్సుల కంటే రైళ్లలో తరలిస్తే మంచిదన్న విజ్ఞప్తుల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
శ్రామిక ప్రత్యేక రైళ్లు నడిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో నిలిచినవారిని స్వస్థలాలకు తరలించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రైలు సేవలు వినియోగించుకునేలా మార్గదర్శకాల్లో సవరణ చేసింది. అంతేగాకుండా, వలస కార్మికులు, కూలీల తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం మాట్లాడుకుని రైల్వే శాఖను సంప్రదించాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అటు రైల్వే ఉన్నతాధికారులు కూడా అన్ని జోనల్ మేనేజర్లకు ప్రత్యేక ఆదేశాలు పంపారు.