Rajashthan: మద్యం షాపులు తెరవాలంటూ 'లాజిక్' చెబుతున్న రాజస్థాన్ ఎమ్మెల్యే!
- రాజస్థాన్ సీఎంకు కాంగ్రెస్ ఎమ్మెల్యే లేఖ
- ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవచ్చు
- వెంటనే షాపులు తెరిపించాలని వినతి
లాక్ డౌన్ కారణంగా గడచిన 38 రోజులుగా దేశవ్యాప్తంగా మద్యం దుకాణాలు మూతపడిన సంగతి తెలిసిందే. మద్యం షాపులను వెంటనే తెరిపించాలన్న డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాలు 4వ తేదీ నుంచి షాపులను తెరచేందుకు అనుమతిని పొందాయి కూడా. ఈ నేపథ్యంలో రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ సింగ్ కుందన్ కపూర్, మద్యం షాపులను తక్షణం తెరిపించాలంటూ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు ఓ లేఖను రాశారు. ఈ లేఖలో తన విజ్ఞప్తికి ఓ 'సహేతుకమైన' వాదననూ ఆయన జోడించారు.
ఆల్కహాల్ తో చేతులను శుభ్రం చేసుకుంటే, చేతిపై ఉన్న కరోనా క్రిములు చనిపోతాయని గుర్తు చేసిన ఆయన, గొంతులో తిష్టవేసి ఉండే కరోనా క్రిములను హతమార్చేందుకు మద్యాన్ని వాడొచ్చు కదా? అని ఆయన అభిప్రాయపడ్డారు. మద్యం షాపుల మూసివేతతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారని తెలిపారు. మార్కెట్లో మద్యానికి డిమాండ్ అధికంగా ఉందని, షాపులను తెరిపిస్తే, లాక్ డౌన్ సమయంలో నష్టపోయిన ప్రభుత్వ ఆదాయాన్ని భర్తీ చేసుకునేందుకు కూడా వీలుంటుందని ఆయన తెలిపారు. ఈ విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకోదు కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని భరత్ సింగ్ కోరారు.