Reliance: కాటేసిన కరోనా... 39 శాతం తగ్గిన రిలయన్స్ ఇండస్ట్రీస్ నికర లాభం!

Reliance Net Profit Reduced 39 Percent
  • నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు విడుదల
  • క్యూ-3తో పోలిస్తే 145 శాతం తగ్గిన నెట్ ప్రాఫిట్
  • రూ. 11,640 కోట్ల నుంచి రూ. 6,348 కోట్లకు
  • అసాధారణ నష్టం రూ. 4,267 కోట్లు
భారత పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ పై కరోనా మహమ్మారి ప్రభావం పడింది. గడచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (2019-20 - జనవరి - మార్చి)లో అసాధారణ నష్టాలు రూ. 4,267 కోట్లు నమోదుకాగా, నికర లాభం ఏకంగా రూ. 6,348 కోట్లకు తగ్గింది. త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించిన రిలయన్స్, క్యూ-3తో పోలిస్తే నికర లాభం 145 శాతం తగ్గిందని డిసెంబర్ తో ముగిసిన త్రైమాసికానికి నికర లాభం రూ. 11,640 కోట్లని వెల్లడించింది.

ఇక 2018-19 నాలుగో త్రైమాసికంలో సంస్థ నెట్ ప్రాఫిట్ రూ. 10,362 కోట్లుకాగా, అది 2019-20లో 39 శాతం పడిపోయింది. ప్రధానంగా ఇంధన, పెట్రో కెమికల్స్ వ్యాపారాలపై రిలయన్స్ ఆధారపడివుండటం, ఫిబ్రవరి, మార్చిలో కరోనా ప్రభావం అధికంగా ఉండటంతో రిలయన్స్ నష్టపోయింది. ముడిచమురు ధరలు పాతాళానికి తగ్గిపోయి, ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పడిపోవడం కూడా అసాధారణ నష్టానికి కారణమైందని సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఇదే సమయంలో రిలయన్స్ జియోతో పాటు టెలికం విభాగం పనితీరు బాగా ఉండటంతో లాభాల క్షీణత మాత్రం తగ్గిందని సంస్థ అభిప్రాయపడింది. మొత్తం కార్యకలాపాల ఆదాయం 2 శాతం తగ్గి, రూ. 1,36,240 కోట్లకు చేరుకుందని వెల్లడించిన రిలయన్స్, కష్టకాలంలో ఈ ఫలితాలు సంతృప్తికరమేనని, ఈ సందర్భంగా ఒక్కో ఈక్విటీ వాటాపై రూ. 6.50 డివిడెండ్ ను అందించేందుకు బోర్డు ఆమోదం పలికిందని వెల్లడించింది.
Reliance
Q-4
Net Profit
Corona Virus
Lockdown

More Telugu News