KTR: నాడు నేను 'ఖైదీ నంబర్ 3077'... జైలు రోజులను గుర్తు చేసుకున్న కేటీఆర్!
- 2009లో హన్మకొండలో అరెస్ట్ అయిన కేటీఆర్
- కేసీఆర్, జయశంకర్ కూడా అరెస్ట్
- ట్విట్టర్ లో గుర్తు చేసుకున్న కేటీఆర్
బుధవారం నాడు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు హంగు, ఆర్భాటాలు లేకుండా జరిగిన వేళ, పార్టీ నేత, రాష్ట్ర మంత్రి కేటీఆర్, ఉద్యమకాలం నాటి జైలు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. వరంగల్ జైలులో తాను గడిపిన రోజులకు సంబంధించిన 'ఖైదీ గుర్తింపు కార్డు' చిత్రాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
"తెలంగాణ ఉద్యమ రోజులను గుర్తు చేసుకుంటున్న వేళ, నా మిత్రుడొకరు దీన్ని పంపించారు. దీక్షా దివస్ రోజున... అంటే, నవంబర్ 29, 2009న కేసీఆర్ గారితో పాటు నేను, జయశంకర్ సార్ అరెస్ట్ అయ్యాము. పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి" అని వ్యాఖ్యానించారు.
ఇక, ఈ గుర్తింపు కార్డులోని వివరాలను పరిశీలిస్తే, హన్మకొండ పోలీసులు 447/2009 కేసులో కేటీఆర్ ను అరెస్ట్ చేశారు. ఆయనపై ఐపీసీ సెక్షన్ 114, 117, 153 (ఏ), 188, 290 సహా పలు సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేయగా, వరంగల్ ఆరో అదనపు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ రిమాండు విధించారు. ఆపై వరంగల్ కేంద్ర కారాగారంలో కేటీఆర్ కు 3077 నంబరును కేటాయించారు.