Telangana: ఆ రూ.500 ఎందుకు వెనక్కి తీసుకున్నామంటే..!: వివరణ ఇచ్చిన తెలంగాణ గ్రామీణ బ్యాంకు
- బీఎస్‌బీడీ ఖాతాలు అనర్హమైనవి
- 3,33,513 ఖాతాల నుంచి రూ. 16,67,56,500 ఉపసంహరణ
- గుర్తించే లోపే 7,506 ఖాతాల నుంచి రూ. 26.5 లక్షలు డ్రా
రూ.500 చొప్పున తెలంగాణలోని జన్‌ధన్ ఖాతాల్లో జమ చేసిన సొమ్మను వెనక్కి తీసుకోవడంపై తెలంగాణ గ్రామీణ బ్యాంకు (టీజీబీ) వివరణ ఇచ్చింది. రాష్ట్రంలోని 423 బ్యాంకు బ్రాంచీల్లో బేసిక్ సేవింగ్స్ డిపాజిట్స్ (బీఎస్‌బీడీ) ఖాతాలు 3,41,019 ఉన్నాయని, జన్‌ధన్ ఖాతాల నియమావళి ప్రకారం ఈ ఖాతాలు పీఎంజీకేవై ప్యాకేజీ కింద మొత్తాలు పొందేందుకు అనర్హమైనవని, అందుకే వాటిలో జమ చేసిన నగదును వెనక్కి తీసుకున్నట్టు టీజీబీ చీఫ్ మేనేజర్ బి.రాజశేఖరం వివరించారు. ఇప్పటి వరకు 3,33,513 ఖాతాల నుంచి రూ. 16,67,56,500 ఉపసంహరించినట్టు తెలిపారు. ఈ ఖాతాలు అనర్హమైనవిగా గుర్తించే లోపే 7,506 ఖాతాల నుంచి రూ. 26.5 లక్షలను ఖాతాదారులు డ్రా చేసినట్టు గుర్తించామన్నారు.