Peru: పెరూ జైలులో 600 మందికి కరోనా.. ఖైదీల బీభత్సం.. 9 మంది మృతి
- కరోనా భయంతో విడుదల చేయాలంటూ ఖైదీల ఆందోళన
- గోడలు ఎక్కి పారిపోయేందుకు ప్రయత్నం
- 70 మందికి గాయాలు
పెరూలోని మైగుల్ క్యాస్ట్రో-క్యాస్ట్రో జైలులో తమను విడుదల చేయాలంటూ ఖైదీలు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో జైలు అధికారులు, సిబ్బంది గాయపడ్డారు. జైలులో నిర్వహించిన కరోనా పరీక్షల్లో 600 మంది ఖైదీలకు వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో జైలులో ఒక్కసారిగా కలకలం రేగింది. తమను విడుదల చేయాలంటూ ఖైదీలందరూ కలిసి ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా హింసాత్మక ఘటనలకు పూనుకున్నారు. చాలామంది ఖైదీలు జైలు గోడలు ఎక్కి పారిపోయేందుకు ప్రయత్నించగా, మరికొందరు జైలు సిబ్బందిపై దాడికి యత్నించారు. మంచాలు తగలబెట్టారు. ఈ సందర్భంగా వారిని అదుపు చేసేందుకు ప్రయత్నించిన 60 మంది జైలు సిబ్బంది, ఐదుగురు పోలీసులు, ఇద్దరు ఖైదీలు గాయపడ్డారు. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, దేశంలో ఇప్పటి వరకు 31 వేల మంది కరోనా బారినపడగా, 800 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.