Chiranjeevi: 'ఈ ఏప్రిల్ 29 చాలా ప్రత్యేకమైన రోజు' అంటూ వీడియో పోస్ట్ చేసిన చిరంజీవి!
- ఈ రోజు వరల్డ్ డ్యాన్స్ డే
- డ్యాన్సే నాకు కోట్లాది మంది అభిమానులను సంపాదించిపెట్టింది
- మీరు డ్యాన్స్ చేసి పోస్ట్ చేయండి.. ఒత్తిడిపోతుంది
- నేను సాయంత్రం నా డ్యాన్సు వీడియోలు పోస్ట్ చేస్తాను
వరల్డ్ డ్యాన్స్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర విషయాలు చెబుతూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. 'ఈ వేళ నేను ఇలా మీ ముందుకు రావడానికి ఓ కారణం ఉంది. ఈ రోజు ఏప్రిల్ 29.. ఈ రోజు ప్రపంచ నాట్య దినోత్సవం. డ్యాన్సుకి, నాకు ఉన్న అనుబంధం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. డ్యాన్సే నాకు కోట్లాది మంది అభిమానులను సంపాదించి పెట్టింది. వారి గుండెల్లో స్థానం సంపాదించుకోవడానికి ఉపయోగపడింది' అని తెలిపారు.
లాక్‌డౌన్ సమయంలో చాలా మంది ఇంట్లోనే ఉంటూ, తమ భవిష్యత్తుపై దిగులు చెందుతూ ఉన్నారని తనకు తెలుసని చిరంజీవి అన్నారు. ఈ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి మ్యూజిక్ పెట్టుకుని డ్యాన్స్ చేయాలని సలహా ఇచ్చారు. దీంతో నూతనోత్సాహం పెంచుకోవచ్చని, ఈ క్లిప్‌లను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయాలని కోరారు. ఈ మధ్య కాలంలో తాను చేసిన డ్యాన్సు బిట్లను ఈ రోజు సాయంత్రం తాను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తానని చెప్పారు.