Srinivas Eedara: అమెరికాలో రెండు వారాల నుంచి ‘కరోనా’ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది: న్యూజెర్సీ నుంచి డాక్టర్ శ్రీనివాస్ ఈదర
- ‘కరోనా’ ఇప్పుడిప్పుడే పోయేది కాదు
- మృతుల్లో అధికశాతం లావుగా ఉన్నవాళ్లు ఉన్నారు
- అరవై ఏళ్లు పైబడిన వారు కూడా
- వ్యాలీ హెల్త్ సిస్టమ్స్ లో క్రిటికల్ కేర్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ శ్రీనివాస్
అమెరికాలో రెండు వారాల నుంచి ‘కరోనా’ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని న్యూజెర్సీ లోని వ్యాలీ హెల్త్ సిస్టమ్స్ లో క్రిటికల్ కేర్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ శ్రీనివాస్ ఈదర తెలిపారు. ‘ఈటీవీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, అయితే, అమెరికాలో పరిస్థితి ఇంకా క్రిటికల్ గానే ఉందని అన్నారు.
రెండు వారాల క్రితం తమ ఆసుపత్రికి రోజుకు నలభై నుంచి యాభై మంది వరకు కరోనా బారిన పడ్డ కొత్త పేషెంట్స్ వచ్చే వారని, ఇప్పుడు ఇరవై ఐదు నుంచి ముప్పై మంది వరకు కొత్త పేషెంట్స్ వస్తున్నారని చెప్పారు. అదే ట్రెండ్ మిగిలిన ఆసుపత్రుల్లో కూడా ఉందని అన్నారు. ‘కరోనా’ ఇప్పుడిప్పుడే పోయేది కాదని, వ్యాక్సిన్ వచ్చేంత వరకూ ఈ వైరస్ ఉంటుందన్న నమ్మకానికి డాక్టర్లు వచ్చారని చెప్పారు. రెండు మూడు వారాల లాక్ డౌన్ తర్వాత ‘కరోనా’ పోయేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ‘కరోనా’ మృతుల్లో అధికశాతం లావుగా ఉన్నవాళ్లు, అరవై నుంచి డెబ్బై సంవత్సరాలు పైబడిన వారు ఉన్నారని తెలిపారు.